పారిజాతాపహరణము

“పారిజాతాపహరణము” కావ్యం తెలుగు పంచమహాకావ్యాలలో ఒకటి. ఈ కావ్యాన్ని రచించినది “నంది తిమ్మన“. ఈయన అష్టదిగ్గజాల్లో ఒకరు. ఈయన్ని “ముక్కు తిమ్మన” అని కూడా అంటారు. ఈయన శైలి మృదుమధురంగా, సహజసుందరంగా, అలంకార ప్రయోగాలతో మనోహరంగా ఉంటుంది. ఈయన కవిత్వం ముద్దుగా ఉంటుందని “ముక్కు తిమ్మనార్యు ముద్దుపలుకు” అని అంటారు.

పారిజాతాపహరణం ఐదు ఆశ్వాసాల కావ్యం. కథ కృష్ణుడు దేవతల తల్లి అయిన అదితీదేవి కుండలాలు అపహరించిన నరకాసురుని వధించిన తరువాత మొదలౌతుంది. ఒకరోజు నారదమునీంద్రులు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి మందిరంలో ఉన్నప్పుడు వచ్చి దర్శిస్తారు. దేవలోకంలో ఉన్న ఇంద్రుని నందనోద్యానం నుంచి తెచ్చిన పారిజాత పుష్పాన్ని శ్రీకృష్ణుడికి సమర్పిస్తారు. దానిని రుక్మిణి కి ఇవ్వాలో సత్యభామకి ఇవ్వాలో కృష్ణుడు తేల్చుకోలేకపోతే నారదుడు తన కనుసైగ ద్వారా దాన్ని రుక్మిణికి ఇప్పిస్తారు. రుక్మిణీదేవి ఆ పుష్పాన్ని ధరించడం వలన దివ్యంగా కనిపిస్తుంది. అప్పుడు కలహభోజనుడైన నారుదుడు రుక్మిణిని పొగిడి, కావాలనే సత్యభామని నిందిస్తారు. అసలు కథ ఇప్పుడే మొదలౌతుంది!

శ్రీకృష్ణుడు పారిజాతపుష్పాన్ని రుక్మిణీదేవికి ఇవ్వడం చూసిన ఓ చెలికత్తె సత్యభామ వద్దకు వెళ్ళి పారిజాత పుష్పం యొక్క గొప్పతనాన్ని, దాన్ని శ్రీకృష్ణుడు రుక్మిణికి ఇవ్వడాన్ని, నారదుడు అన్న మాటలనీ వివరిస్తుంది. అప్పుడు సత్యభామ కోపాన్ని నందితిమ్మన అందంగా ఇలా వర్ణించారు –

చ॥ అనవిని వ్రేటువడ్డ యురగాంగనయుంబలె, నేయివోయ భ
గ్గన దరికొన్న భీషణ హుతాశనకీల యనంగలేచి, హె
చ్చిన కనుదోయి కెంపు తన చెక్కుల గుంకుమ పత్ర భంగ సం
జనిత నవీనకాంతి వెదచల్లగ గద్గద ఖిన్న కంఠియై!

భావం: చెలికత్తె చెప్పిన మాట వినగానే సత్యభామ దెబ్బతిన్న ఆడ త్రాచుపాము వలె, నెయ్యి వేసినప్పుడు భగ్గుమని పెరిగే అగ్నిజ్వాల లాగ లేచింది. కోపంతో కళ్ళు ఎరుపెక్కాయి. చెక్కిళ్ళపై ఉన్న పత్రభంగ అలంకరణ, చెదిగిన కుంకుమతో కలిసి కొత్త వెలుగు వెదజల్లింది. జరిగిన విషయానికి బాధతో గొంతు జీరబోయింది.

ఈ పద్యంలో సత్యభామ కోపం ఎలా ఉందో ఊహించి చెప్పారు నందితిమ్మన. అలా ఊహించి వర్ణించడాన్ని ఉత్ప్రేక్షాలంకారం అంటారు.

అంతటి కోపంలో ఉన్న సత్యభామ చెలికత్తెతో ఇలా అంది –

శా॥ ఏమేమీ! కలహాశనుండచటికై యేతెంచి యిట్లాడెనా
యా మాటల్చెవియొగ్గి తావినియెనా యాగోపికావల్లభుం
డేమే మాడెను రుక్మిణీ సతియు? నీ వింకేటికి దాచెదే!
నీ మోమోటలు మాని నీరజముఖీ! నిక్కంబెరింగింపవే!

భావం: ఏమిటీ? నారుదుడు రుక్మిణీదేవి గృహానికి వచ్చి ఇలా మాట్లాడాడా? గోపికావల్లభుడైన శ్రీకృష్ణుడు చెవి అప్పగించి విన్నాడా? రుక్మిణీదేవి ఏమంది? నువ్వు మొహమాటం మాని దాచకుండా నిజాలన్నీ నాకు చెప్పు, ఓ నీరజముఖీ!

చెలికత్తె పూసగుచ్చి జరిగినదంతా వివరించింది. సత్యభామ నారదుడినీ, రుక్మిణినీ నిందించి చివరికి వారి తప్పేమీ లేదనీ తప్పంతా శ్రీకృష్ణుడిదేనని అంటూ కోపగృహంలోకి ప్రవేశిస్తుంది. ఈ విషయం శ్రీకృష్ణుడికి తెలుస్తుంది. ఆయన సత్యభామ దగ్గరకి చేరి లాలనతో ఊరడిస్తాడు. సత్యభామ ఎంతకీ వినకపోతే చివరికి సత్యభామ పాదాలపై పడి మ్రొక్కబోతాడు. అప్పుడు సత్యభామ తన ఎడమపాదంతో శ్రీకృష్ణుని శిరస్సును నెట్టేస్తుంది!

కృష్ణుడు కోపగించుకోకపోగా తన శిరస్సును తాకి సత్యభామ పాదం ఎంత కందిపోయిందో అని బాధపడి సత్యభామ పాదాలను ఒత్తుతాడు. అయినా సత్యభామ శాంతించక శ్రీకృష్ణుని నిందించి తనకిక మరణమే శరణమంటుంది! ఆఖరికి శ్రీకృష్ణుడు, ఒక్క పారిజాత పుష్పమే కాదు, ఏకంగా పారిజాత వృక్షాన్నే తెచ్చి తోటలో నాటిస్తానని వాగ్దానం చేస్తాడు. దానితో సత్యభామ శాంతిస్తుంది.

ఆ పక్కరోజు నారదుడు సత్యభామ అంతఃపురానికి వచ్చి, భోజనం చేసి సత్యభామను దీవించి స్వర్గలోకానికి పయనమవుతాడు. శ్రీకృష్ణుడు నారదునితో అదితీదేవి కుండలాలను ఇవ్వడానికి త్వరలో తాము వస్తున్నామని దేవేంద్రునితో చెప్పమంటాడు. ఆ మరుసటిరోజు సత్యాకృష్ణులు గరుడ వాహనంపైన స్వర్గానికి పయనమవుతారు. శ్రీకృష్ణుడికి దేవేంద్రుడూ మిగతా దేవతలు నమస్కరించి సత్కరిస్తారు. తర్వాత శ్రీకృష్ణుడు అదితీదేవిని దర్శించి ఆమె కుండలాలను ఇస్తాడు. ఆమె శ్రీకృష్ణుడిని స్తుతిస్తుంది.

మరునాటి ఉదయం శ్రీకృష్ణుడూ, సత్యభామ నందన వన విహారానికి వెళతారు. అక్కడ పారిజాతవృక్షాన్ని శ్రీకృష్ణుడు పెకిలించి తనతో తీసుకువెళ్ళడానికి గరుడునిపై ఉంచుతాడు. దీనిని గమనించి వనపాలకులు అడ్డగించి – “మా ఇంద్రుడి వృక్షాన్ని మీరు తీసుకెళ్లకూడదు!” అంటారు.

అప్పుడు సత్యభామ వారితో సముద్రాన్ని చిలికినపుడు వచ్చిన లక్ష్మీదేవీ, కౌస్తుభమణీ శ్రీకృష్ణునికి దక్కినట్టే పారిజాతవృక్షమూ కృష్ణునిదేననీ, కాబట్టి తీసుకెళుతున్నాననీ, కావాలంటే ఇంద్రుణ్ణి వచ్చి తిరిగి తీసుకెళ్ళమని చెబుతుంది.

విషయం తెలిసిన దేవేంద్రుడు కోపంతో కృష్ణుడిపై యుద్ధం చేసి పారిజాతవృక్షాన్ని తిరిగి తీసుకువస్తానని తన భార్య అయిన శచీదేవితో చెప్తాడు. దేవసైన్యంతో కృష్ణునిపై యుద్ధానికి వెళతాడు. శ్రీకృష్ణుడూ, దేవేంద్రుడూ పోటాపోటీగా యుద్ధం చేస్తారు. చివరకి దేవేంద్రుడు వజ్రాయుధాన్ని కృష్ణునిపై ప్రయోగిస్తాడు. శ్రీకృష్ణుడు దాన్ని చేతితో పట్టుకుని అడ్డగిస్తాడు. అప్పుడు దేవేంద్రుడు ఓటమిని అంగీకరించి శ్రీకృష్ణుని శరణువేడతాడు. పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుణ్ణి భూలోకానికి తీసుకెళ్ళమంటాడు. సత్యా శ్రీకృష్ణులు పారిజాతవృక్షంతో భూలోకానికి చేరుకుంటారు.

పారిజాత వృక్ష ప్రభావం వలన పురజనులకి అనేక విధాలుగా మేలు జరుగుతుంది. చెవిటివాళ్ళు వినగలుగుతారు, అంధులకు చూపు వస్తుంది, దరిద్రులు ధనవంతులవుతారు.

శ్రీకృష్ణుడు ద్వారకలోని తన తల్లితండ్రులైన దేవకీ వసుదేవులకు మొక్కి, బంధుజనాలను ఆత్మీయులను ఉచితరీతిని సత్కరించి, ఆ పారిజాత వృక్షాన్ని సత్యభామకు సమర్పించి తన వాగ్దానం నెరవేర్చుకుంటాడు. ఆ వృక్షాన్ని సత్యభామ తన తోటలో నాటించుకుంది.

కొద్దిరోజుల తరువాత నారదుడు తిరిగి శ్రీకృష్ణా సత్యభామల వద్దకు వచ్చి “పుణ్యక” వ్రత మహత్యాన్ని గురించి చెబుతాడు. సత్యభామ ఆ వ్రతాన్ని ఆచరించడానికి ఒప్పుకుంటుంది. వ్రత నిర్వహణలో భాగంగా తన సవతులను వారి వారి ఇంటికి వెళ్ళి పేరుపేరునా ఆహ్వానిస్తుంది.

వ్రత నిర్వహణకు కృష్ణుని కోరికపై విశ్వకర్మ ఒక దానమండపాన్ని నిర్మిస్తాడు. వ్రతానికి బంధువులూ, ఆత్మీయులు మొదలైన వారు వస్తారు. సత్యభామ ఆ వ్రతము చేసి తన సవతులందరికీ పారిజాతపుష్పాలను బంగారు పళ్ళాలలో ఉంచి బహూకరిస్తుంది. తరువాత వ్రత నియమం ప్రకారం నారదునికి శ్రీకృష్ణుని పారిజాతవృక్షంతో సహా దానమిస్తుంది. అప్పుడు నారదుడు సత్యభామని పరిహసించాలని శ్రీకృష్ణుని చేత తన వీణను, కమండలాన్ని, జింక చర్మాన్ని మోయిస్తాడు. ఇది చూసి సత్యభామ నొచ్చుకోగా, నారుదుడు చిరునవ్వుతో కృష్ణుని మళ్ళీ సత్యభామకి దానమిచ్చి ఆమె నగలను పుచ్చుకుంటాడు. సత్యభామ సంతోషిస్తుంది.

ఈ సందర్భంలో నారదుడు శ్రీకృష్ణుని స్తోత్రము చేస్తాడు. ఈ స్తోత్రము చేసిన పది పద్యాలను నందితిమ్మన బంధకవిత్వముతో రాశాడు. వాటిలో మూడు పద్యాలు విందాం!

మొదటి పద్యం –

క॥ నాయ శరగ సార విరయ
తాయన జయసార సుభగధర ధీ నియమా
మాయ నిధీ రధ గ భసుర
సారజనయ తాయరవిర సాగర శయనా!

ఈ పద్యం మొదటి రెండు పాదాలూ వెనక్కి తిరగేస్తే మూడు నాలుగు పాదాలు వస్తాయి. ఇలా రాసిన కంద పద్యాన్ని “అర్ధ భ్రమక కందము” అంటారు. ఈ పద్యానికి భావం ఇది – “ఓ కృష్ణా! నువ్వు నీతిని బాణంగా చేసి, పక్షివేగంతో కదిలి యుద్ధంలో గెలిచే శక్తి ఉన్న వాడివి. లక్ష్మీదేవిని వక్షస్థలమున నిలుపుకున్నావు. బుద్ధికి కట్టుపడిన వాడివి. లక్షీదేవి సంపదలకు గని వంటివాడివి. నీ శరీరములో చంద్రాది దిక్పాలకులు కొలువై ఉన్నారు. క్షీరసాగరాన శయనించే వాడివి నువ్వు!”

రెండవ పద్యం –

క॥ ధీర శయనీయ శరధీ
మార విభానుమత మమత మనుభావిరమా
సార సవన నవసరసా
దారద సమ తారహార తామస దరదా

ఈ కంద పద్యంలో ప్రతి పాదం ముందు నుంచి చదివినా వెనుక నుంచి చదివినా ఒకేలా ఉంటుంది. దీన్ని “పాద భ్రమక కందము” అంటారు. ఈ పద్యానికి భావం ఇది – “ఓ కృష్ణా! నువ్వు ధైర్యంతో సముద్రమునే ఆధీనం చేసుకుని, మన్మధుని మించిన దేహకాంతితో తలచుకున్నంతనే సంపదలు ఇచ్చే వాడివి! సముద్రము నుంచి లభించిన మేలైన మంచి ముత్యాలు ధరించిన వాడివి. మంచివారి చెంత ఉండి చెడ్డవారిని శిక్షించే వాడివి.

మూడవ పద్యం –

క॥ మనమున ననుమానము నూ
నను నీ నామమను మను మననమును నేమ
మ్మున మాన నన్ను మన్నన
మనుమను నానా మునీన మానానూనా

“న”, “మ” అనే రెండు హల్లులతోనే రాసిన ఈ కందాన్ని “ద్వ్యక్షరి కందము” అంటారు. ఈ పద్యంలో వృత్త్యానుప్రాస అలంకారం కూడా ఉంది.

ఈ పద్యం భావం ఇది – “ఓ కృష్ణా! నువ్వు నిరంతరం నీ నామధ్యానం చేసే మునులకు సైతం అందనంతటి గొప్పవాడివి. నాకు ఎలాంటి సందేహం లేదు. నీ నామ జపాన్నే నియమంగా జపించే నన్ను దయతో చల్లగా దీవించు.”

ఈ విధంగా కృష్ణుని స్తుతించి నారదుడు స్వర్గలోకానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు తన భార్యలతో హాయిగా ఉన్నాడు. పారిజాతాపహరణ కావ్యం సమాప్తం!

(మనబడి ప్రభాసం పిల్లలు ప్రభాసం తరగతిలో పారిజాతాపహరణం కావ్యంలోని పై పద్యాలన్నీ చదువుకున్నారు. వాళ్ళ చేత మొత్తం కథని క్లాసులో తల్లిదండ్రుల ముందు చెప్పించడానికి సంక్షిప్తంగా పారిజాతాపహరణ కథని ఇలా రాశాను)

ఉపయుక్త గ్రంధాలు:

  1. మనబడి ప్రభాసం Q1 పుస్తకం
  2. టీకా సహిత పారిజాతాపహరణ కావ్యం arhive.org లో – పారిజాతాపహరణం
  3. పారిజాతాపహరణంపై థీసిస్

2 thoughts on “పారిజాతాపహరణము

  1. టపా బాగుంది!
    ఎక్కువ రాస్తే ఉన్నమాట చెడిపోతుంది, అందుకే ఒక్క మాట తో సరిపెట్టాను.

    ఒక్కనుమానం! ఒకప్పుడు ’ఎదసడి’ బ్లాగుండేది, అదిప్పుడు కనపట్టం లేదు, వారే మీరా?

  2. నమస్కారం శర్మ గారూ! మీ వ్యాఖ్య ఆనందం కలిగించింది, పాత కాలం బ్లాగు రోజులు గుర్తొచ్చాయి, ఈ మధ్య ఎవరూ బ్లాగుల్లో కామెంట్లు పెట్టట్లేదు. ఫేస్బుక్ ద్వారా బ్లాగులు చదివేవాళ్ళే తప్ప మీలాంటి కొత్తవాళ్ళు రావడం అరుదు! “ఎదసడి” నేను కాదు, ఎవరో తెలీదు.

    మీ బ్లాగు బావుంది. చాలా విరివిగా రాసినట్టు ఉన్నారు. మీబోటి పెద్దవారిని చూసి ఏమీ తెలియని నాలాంటి వాళ్ళు ఎంతైనా నేర్చుకోవచ్చు.

వ్యాఖ్యానించండి