సినారెకి శిరసా వందనం, కన్నీటి నీరాజనం

కవికి మరణం లేదనీ, తన కవితల్లో బ్రతికే ఉంటాడనీ అంటారు. అది నిజమే కావొచ్చు కానీ కవి భౌతికంగా లేకపోవడమూ ఒక లోటే, ఒక బాధే కవితా ప్రేమికుడికి. సినారె గారే అన్నారు –

నీడలాగ నీ వెంటపడేదే నిక్కమైన కీర్తి మృత్యుబాహువులకి అందలేనిదే నిత్యమైన కీర్తి

అలాంటి కీర్తి ఆయనకి ఉంది. ఆయనే లేరు.

నా మటుకు సినారె అంటే కవి, సినిమా పాటల రచయిత కాదు. నేను వచన కవిత్వాన్ని ఆస్వాదించినదీ, వచన కవిత్వం గురించి నేర్చుకున్నదీ సినారె కవితల ద్వారానే. అప్పటికి నాకు సినిమా పాటలతోనే తప్ప కవిత్వంతో పరిచయం లేదు. శ్రీశ్రీ, తిలక్ వంటి కవుల రచనలు కొన్ని తిరగేసినా, ఆ కవిత్వం నన్ను అంటలేదు. ఇంకా చెప్పాలంటే అర్థం కాలేదు! ఆ కవిత్వభాష నాకు బొత్తిగా తెలియలేదు. అందుకే కొంచెం అర్థమయ్యినట్టు అనిపించినా పూర్తిగా ఆస్వాదించలేకపోయాను. కానీ “వార్త” మొదలైన పత్రికల్లో వచ్చే సినారె కవితలు బాగా అర్థమయ్యేవి! ఆ కవితల్లోని ఆశావహ దృక్పథం, మనిషిని తట్టిలేపే గుణం, సామాజిక స్పృహ నన్ను ఆకట్టుకునేవి! సమాజ ఉద్ధరణ కోసమంటూ కవిత్వంతో కత్తులు దూసే అభ్యుదయ కవిత్వాలు నాకు పడవు! ఆప్తుడు చెప్పే మంచిమాటలా కొన్ని సార్లు సుతిమెత్తగా, కొన్ని సార్లు సూటిగా, కొన్ని సార్లు కటువుగా చేప్పే సినారె పద్ధతి నాకు బాగా నచ్చుతుంది. అందుకే నేను మొదటి సారి కొన్న కవితా సంపుటీ సినారేదే! అది మనిషి గురించి గొప్పగా వివరించిన కావ్యమైన “విశ్వంభర”! ఆ కావ్యం ముగింపు వాక్యాలు నాకు చాలా ఇష్టం –

ఋషిత్వానికీ పశుత్వానికీ
సంస్కృతికీ దుష్కృతికీ
స్వచ్ఛందతకూ నిర్బంధతకూ
సమార్ద్రతకూ రౌద్రతకూ 
తొలిబీజం మనసు 
తులారూపం మనసు 
మనసుకు తొడుగు మనిషి 
మనిషికి ఉడుపు జగతి 
ఇదే విశ్వంభరాతత్త్వం 
ఇదే అనంత జీవితసత్యం!

ఈ మనిషితనాన్ని సిరివెన్నెల పాటలకు ముందు సినారె కవిత్వంలోనే నేను దర్శించాను! 

ఇక పాటల రచయితగా సినారె ప్రతిభ గురించి చెప్పక్కరలేదు. “లలితా కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను” పాటంటే ఎంత ఇష్టమో చెప్పలేను. ఒక కళాకారుడికి ఉండాల్సిన దృక్పథాన్ని ఇంత గొప్పగా చెప్పిన పాట ఇంకోటి కనిపించదు. “గోరంత దీపం కొండంత వెలుగు, చిగురంత ఆశ జగమంత వెలుగు” పాటలోని “మతితప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు” అన్న వాక్యం స్ఫూర్తితో నేను ఎన్ని ఫేస్ బుక్, ట్విటర్ సంభాషణలకి స్పందించకుండా ఆగానో లెక్కలేదు! అదే పాటలోని “నీళ్ళులేని ఎడారిలో కన్నీళ్ళైన తాగి బ్రతకాలి” అన్న వాక్యాలను మించిన స్ఫూర్తి ఎక్కడుంది బ్రతుకులో! ఇక విశ్వనాథ్ గారి చిత్రాలకి సినారె రాసిన పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే. “లాలి లాలి” పాట నుంచి, స్వాతికిరణం పాటలు వరకూ ఎన్నెన్ని ఆణిముత్యాలో! ఆపద్భాంధవుడు చిత్రానికి సినారె రాసిన “గువ్వా నవ్వె” పాటా, సూత్రధారుల్లో “మూడు బురుజుల కోట” పాట నేను పదే పదే పాడుకున్న పాటలు, నాకు చాలా ఇష్టమైన పాటలు. 

ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నెన్నో పాటలు ఉన్నాయి. ఒక్క సారి చదివితే ఎదలో నిలిచిపోయే కవితా, ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలిపోయే ఘనతా సినారెది! లోకం పట్టనంత కీర్తి చుట్టుకున్నా, గిట్టని వాళ్ళు ఎన్నో మాటలన్నా, ఏమీ పట్టనట్టు హుందాగా నడిచి వెళ్ళిపోయిన జ్ఞాని సినారె! ఆ మహాకవికి నివాళి అర్పిస్తూ ఆయన అందించిన జ్ఞానాన్ని గుర్తుచేసుకోవడమే మనం చెయ్యగలిగేది – 

చేదు సత్యం మింగగలిగితే జీవితం వైద్యాలయం 
మనసు పుటలను చదవగలిగితే అనుభవం విద్యాలయం 
ఎవ్వరో నేర్పాలనే భ్రమ ఎందుకంట వృథా వృథా! 
అడుగు తప్పక ఆడగలిగితే అవనియే నృత్యాలయం 
కనులు తిప్పక చూడగలిగితే అణువణువు తత్త్వాలయం! 

పారిజాతాపహరణము

“పారిజాతాపహరణము” కావ్యం తెలుగు పంచమహాకావ్యాలలో ఒకటి. ఈ కావ్యాన్ని రచించినది “నంది తిమ్మన“. ఈయన అష్టదిగ్గజాల్లో ఒకరు. ఈయన్ని “ముక్కు తిమ్మన” అని కూడా అంటారు. ఈయన శైలి మృదుమధురంగా, సహజసుందరంగా, అలంకార ప్రయోగాలతో మనోహరంగా ఉంటుంది. ఈయన కవిత్వం ముద్దుగా ఉంటుందని “ముక్కు తిమ్మనార్యు ముద్దుపలుకు” అని అంటారు.

పారిజాతాపహరణం ఐదు ఆశ్వాసాల కావ్యం. కథ కృష్ణుడు దేవతల తల్లి అయిన అదితీదేవి కుండలాలు అపహరించిన నరకాసురుని వధించిన తరువాత మొదలౌతుంది. ఒకరోజు నారదమునీంద్రులు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి మందిరంలో ఉన్నప్పుడు వచ్చి దర్శిస్తారు. దేవలోకంలో ఉన్న ఇంద్రుని నందనోద్యానం నుంచి తెచ్చిన పారిజాత పుష్పాన్ని శ్రీకృష్ణుడికి సమర్పిస్తారు. దానిని రుక్మిణి కి ఇవ్వాలో సత్యభామకి ఇవ్వాలో కృష్ణుడు తేల్చుకోలేకపోతే నారదుడు తన కనుసైగ ద్వారా దాన్ని రుక్మిణికి ఇప్పిస్తారు. రుక్మిణీదేవి ఆ పుష్పాన్ని ధరించడం వలన దివ్యంగా కనిపిస్తుంది. అప్పుడు కలహభోజనుడైన నారుదుడు రుక్మిణిని పొగిడి, కావాలనే సత్యభామని నిందిస్తారు. అసలు కథ ఇప్పుడే మొదలౌతుంది!

శ్రీకృష్ణుడు పారిజాతపుష్పాన్ని రుక్మిణీదేవికి ఇవ్వడం చూసిన ఓ చెలికత్తె సత్యభామ వద్దకు వెళ్ళి పారిజాత పుష్పం యొక్క గొప్పతనాన్ని, దాన్ని శ్రీకృష్ణుడు రుక్మిణికి ఇవ్వడాన్ని, నారదుడు అన్న మాటలనీ వివరిస్తుంది. అప్పుడు సత్యభామ కోపాన్ని నందితిమ్మన అందంగా ఇలా వర్ణించారు –

చ॥ అనవిని వ్రేటువడ్డ యురగాంగనయుంబలె, నేయివోయ భ
గ్గన దరికొన్న భీషణ హుతాశనకీల యనంగలేచి, హె
చ్చిన కనుదోయి కెంపు తన చెక్కుల గుంకుమ పత్ర భంగ సం
జనిత నవీనకాంతి వెదచల్లగ గద్గద ఖిన్న కంఠియై!

భావం: చెలికత్తె చెప్పిన మాట వినగానే సత్యభామ దెబ్బతిన్న ఆడ త్రాచుపాము వలె, నెయ్యి వేసినప్పుడు భగ్గుమని పెరిగే అగ్నిజ్వాల లాగ లేచింది. కోపంతో కళ్ళు ఎరుపెక్కాయి. చెక్కిళ్ళపై ఉన్న పత్రభంగ అలంకరణ, చెదిగిన కుంకుమతో కలిసి కొత్త వెలుగు వెదజల్లింది. జరిగిన విషయానికి బాధతో గొంతు జీరబోయింది.

ఈ పద్యంలో సత్యభామ కోపం ఎలా ఉందో ఊహించి చెప్పారు నందితిమ్మన. అలా ఊహించి వర్ణించడాన్ని ఉత్ప్రేక్షాలంకారం అంటారు.

అంతటి కోపంలో ఉన్న సత్యభామ చెలికత్తెతో ఇలా అంది –

శా॥ ఏమేమీ! కలహాశనుండచటికై యేతెంచి యిట్లాడెనా
యా మాటల్చెవియొగ్గి తావినియెనా యాగోపికావల్లభుం
డేమే మాడెను రుక్మిణీ సతియు? నీ వింకేటికి దాచెదే!
నీ మోమోటలు మాని నీరజముఖీ! నిక్కంబెరింగింపవే!

భావం: ఏమిటీ? నారుదుడు రుక్మిణీదేవి గృహానికి వచ్చి ఇలా మాట్లాడాడా? గోపికావల్లభుడైన శ్రీకృష్ణుడు చెవి అప్పగించి విన్నాడా? రుక్మిణీదేవి ఏమంది? నువ్వు మొహమాటం మాని దాచకుండా నిజాలన్నీ నాకు చెప్పు, ఓ నీరజముఖీ!

చెలికత్తె పూసగుచ్చి జరిగినదంతా వివరించింది. సత్యభామ నారదుడినీ, రుక్మిణినీ నిందించి చివరికి వారి తప్పేమీ లేదనీ తప్పంతా శ్రీకృష్ణుడిదేనని అంటూ కోపగృహంలోకి ప్రవేశిస్తుంది. ఈ విషయం శ్రీకృష్ణుడికి తెలుస్తుంది. ఆయన సత్యభామ దగ్గరకి చేరి లాలనతో ఊరడిస్తాడు. సత్యభామ ఎంతకీ వినకపోతే చివరికి సత్యభామ పాదాలపై పడి మ్రొక్కబోతాడు. అప్పుడు సత్యభామ తన ఎడమపాదంతో శ్రీకృష్ణుని శిరస్సును నెట్టేస్తుంది!

కృష్ణుడు కోపగించుకోకపోగా తన శిరస్సును తాకి సత్యభామ పాదం ఎంత కందిపోయిందో అని బాధపడి సత్యభామ పాదాలను ఒత్తుతాడు. అయినా సత్యభామ శాంతించక శ్రీకృష్ణుని నిందించి తనకిక మరణమే శరణమంటుంది! ఆఖరికి శ్రీకృష్ణుడు, ఒక్క పారిజాత పుష్పమే కాదు, ఏకంగా పారిజాత వృక్షాన్నే తెచ్చి తోటలో నాటిస్తానని వాగ్దానం చేస్తాడు. దానితో సత్యభామ శాంతిస్తుంది.

ఆ పక్కరోజు నారదుడు సత్యభామ అంతఃపురానికి వచ్చి, భోజనం చేసి సత్యభామను దీవించి స్వర్గలోకానికి పయనమవుతాడు. శ్రీకృష్ణుడు నారదునితో అదితీదేవి కుండలాలను ఇవ్వడానికి త్వరలో తాము వస్తున్నామని దేవేంద్రునితో చెప్పమంటాడు. ఆ మరుసటిరోజు సత్యాకృష్ణులు గరుడ వాహనంపైన స్వర్గానికి పయనమవుతారు. శ్రీకృష్ణుడికి దేవేంద్రుడూ మిగతా దేవతలు నమస్కరించి సత్కరిస్తారు. తర్వాత శ్రీకృష్ణుడు అదితీదేవిని దర్శించి ఆమె కుండలాలను ఇస్తాడు. ఆమె శ్రీకృష్ణుడిని స్తుతిస్తుంది.

మరునాటి ఉదయం శ్రీకృష్ణుడూ, సత్యభామ నందన వన విహారానికి వెళతారు. అక్కడ పారిజాతవృక్షాన్ని శ్రీకృష్ణుడు పెకిలించి తనతో తీసుకువెళ్ళడానికి గరుడునిపై ఉంచుతాడు. దీనిని గమనించి వనపాలకులు అడ్డగించి – “మా ఇంద్రుడి వృక్షాన్ని మీరు తీసుకెళ్లకూడదు!” అంటారు.

అప్పుడు సత్యభామ వారితో సముద్రాన్ని చిలికినపుడు వచ్చిన లక్ష్మీదేవీ, కౌస్తుభమణీ శ్రీకృష్ణునికి దక్కినట్టే పారిజాతవృక్షమూ కృష్ణునిదేననీ, కాబట్టి తీసుకెళుతున్నాననీ, కావాలంటే ఇంద్రుణ్ణి వచ్చి తిరిగి తీసుకెళ్ళమని చెబుతుంది.

విషయం తెలిసిన దేవేంద్రుడు కోపంతో కృష్ణుడిపై యుద్ధం చేసి పారిజాతవృక్షాన్ని తిరిగి తీసుకువస్తానని తన భార్య అయిన శచీదేవితో చెప్తాడు. దేవసైన్యంతో కృష్ణునిపై యుద్ధానికి వెళతాడు. శ్రీకృష్ణుడూ, దేవేంద్రుడూ పోటాపోటీగా యుద్ధం చేస్తారు. చివరకి దేవేంద్రుడు వజ్రాయుధాన్ని కృష్ణునిపై ప్రయోగిస్తాడు. శ్రీకృష్ణుడు దాన్ని చేతితో పట్టుకుని అడ్డగిస్తాడు. అప్పుడు దేవేంద్రుడు ఓటమిని అంగీకరించి శ్రీకృష్ణుని శరణువేడతాడు. పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుణ్ణి భూలోకానికి తీసుకెళ్ళమంటాడు. సత్యా శ్రీకృష్ణులు పారిజాతవృక్షంతో భూలోకానికి చేరుకుంటారు.

పారిజాత వృక్ష ప్రభావం వలన పురజనులకి అనేక విధాలుగా మేలు జరుగుతుంది. చెవిటివాళ్ళు వినగలుగుతారు, అంధులకు చూపు వస్తుంది, దరిద్రులు ధనవంతులవుతారు.

శ్రీకృష్ణుడు ద్వారకలోని తన తల్లితండ్రులైన దేవకీ వసుదేవులకు మొక్కి, బంధుజనాలను ఆత్మీయులను ఉచితరీతిని సత్కరించి, ఆ పారిజాత వృక్షాన్ని సత్యభామకు సమర్పించి తన వాగ్దానం నెరవేర్చుకుంటాడు. ఆ వృక్షాన్ని సత్యభామ తన తోటలో నాటించుకుంది.

కొద్దిరోజుల తరువాత నారదుడు తిరిగి శ్రీకృష్ణా సత్యభామల వద్దకు వచ్చి “పుణ్యక” వ్రత మహత్యాన్ని గురించి చెబుతాడు. సత్యభామ ఆ వ్రతాన్ని ఆచరించడానికి ఒప్పుకుంటుంది. వ్రత నిర్వహణలో భాగంగా తన సవతులను వారి వారి ఇంటికి వెళ్ళి పేరుపేరునా ఆహ్వానిస్తుంది.

వ్రత నిర్వహణకు కృష్ణుని కోరికపై విశ్వకర్మ ఒక దానమండపాన్ని నిర్మిస్తాడు. వ్రతానికి బంధువులూ, ఆత్మీయులు మొదలైన వారు వస్తారు. సత్యభామ ఆ వ్రతము చేసి తన సవతులందరికీ పారిజాతపుష్పాలను బంగారు పళ్ళాలలో ఉంచి బహూకరిస్తుంది. తరువాత వ్రత నియమం ప్రకారం నారదునికి శ్రీకృష్ణుని పారిజాతవృక్షంతో సహా దానమిస్తుంది. అప్పుడు నారదుడు సత్యభామని పరిహసించాలని శ్రీకృష్ణుని చేత తన వీణను, కమండలాన్ని, జింక చర్మాన్ని మోయిస్తాడు. ఇది చూసి సత్యభామ నొచ్చుకోగా, నారుదుడు చిరునవ్వుతో కృష్ణుని మళ్ళీ సత్యభామకి దానమిచ్చి ఆమె నగలను పుచ్చుకుంటాడు. సత్యభామ సంతోషిస్తుంది.

ఈ సందర్భంలో నారదుడు శ్రీకృష్ణుని స్తోత్రము చేస్తాడు. ఈ స్తోత్రము చేసిన పది పద్యాలను నందితిమ్మన బంధకవిత్వముతో రాశాడు. వాటిలో మూడు పద్యాలు విందాం!

మొదటి పద్యం –

క॥ నాయ శరగ సార విరయ
తాయన జయసార సుభగధర ధీ నియమా
మాయ నిధీ రధ గ భసుర
సారజనయ తాయరవిర సాగర శయనా!

ఈ పద్యం మొదటి రెండు పాదాలూ వెనక్కి తిరగేస్తే మూడు నాలుగు పాదాలు వస్తాయి. ఇలా రాసిన కంద పద్యాన్ని “అర్ధ భ్రమక కందము” అంటారు. ఈ పద్యానికి భావం ఇది – “ఓ కృష్ణా! నువ్వు నీతిని బాణంగా చేసి, పక్షివేగంతో కదిలి యుద్ధంలో గెలిచే శక్తి ఉన్న వాడివి. లక్ష్మీదేవిని వక్షస్థలమున నిలుపుకున్నావు. బుద్ధికి కట్టుపడిన వాడివి. లక్షీదేవి సంపదలకు గని వంటివాడివి. నీ శరీరములో చంద్రాది దిక్పాలకులు కొలువై ఉన్నారు. క్షీరసాగరాన శయనించే వాడివి నువ్వు!”

రెండవ పద్యం –

క॥ ధీర శయనీయ శరధీ
మార విభానుమత మమత మనుభావిరమా
సార సవన నవసరసా
దారద సమ తారహార తామస దరదా

ఈ కంద పద్యంలో ప్రతి పాదం ముందు నుంచి చదివినా వెనుక నుంచి చదివినా ఒకేలా ఉంటుంది. దీన్ని “పాద భ్రమక కందము” అంటారు. ఈ పద్యానికి భావం ఇది – “ఓ కృష్ణా! నువ్వు ధైర్యంతో సముద్రమునే ఆధీనం చేసుకుని, మన్మధుని మించిన దేహకాంతితో తలచుకున్నంతనే సంపదలు ఇచ్చే వాడివి! సముద్రము నుంచి లభించిన మేలైన మంచి ముత్యాలు ధరించిన వాడివి. మంచివారి చెంత ఉండి చెడ్డవారిని శిక్షించే వాడివి.

మూడవ పద్యం –

క॥ మనమున ననుమానము నూ
నను నీ నామమను మను మననమును నేమ
మ్మున మాన నన్ను మన్నన
మనుమను నానా మునీన మానానూనా

“న”, “మ” అనే రెండు హల్లులతోనే రాసిన ఈ కందాన్ని “ద్వ్యక్షరి కందము” అంటారు. ఈ పద్యంలో వృత్త్యానుప్రాస అలంకారం కూడా ఉంది.

ఈ పద్యం భావం ఇది – “ఓ కృష్ణా! నువ్వు నిరంతరం నీ నామధ్యానం చేసే మునులకు సైతం అందనంతటి గొప్పవాడివి. నాకు ఎలాంటి సందేహం లేదు. నీ నామ జపాన్నే నియమంగా జపించే నన్ను దయతో చల్లగా దీవించు.”

ఈ విధంగా కృష్ణుని స్తుతించి నారదుడు స్వర్గలోకానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు తన భార్యలతో హాయిగా ఉన్నాడు. పారిజాతాపహరణ కావ్యం సమాప్తం!

(మనబడి ప్రభాసం పిల్లలు ప్రభాసం తరగతిలో పారిజాతాపహరణం కావ్యంలోని పై పద్యాలన్నీ చదువుకున్నారు. వాళ్ళ చేత మొత్తం కథని క్లాసులో తల్లిదండ్రుల ముందు చెప్పించడానికి సంక్షిప్తంగా పారిజాతాపహరణ కథని ఇలా రాశాను)

ఉపయుక్త గ్రంధాలు:

 1. మనబడి ప్రభాసం Q1 పుస్తకం
 2. టీకా సహిత పారిజాతాపహరణ కావ్యం arhive.org లో – పారిజాతాపహరణం
 3. పారిజాతాపహరణంపై థీసిస్

స్వర “బాలు”నికి అక్షరార్చన

(ఈ రోజు (June 4) SPB పుట్టినరోజు. 2012 అక్టోబరులో ఆయన శాండియాగోలో మ్యూజిక్ షో చేసినప్పుడు, శాండియాగో తెలుగు అసోసియేషన్ ఆయన్ని సత్కరించి సన్మానపత్రాన్ని అందించింది. అప్పుడు నేను రాసిన సన్మానపత్రాన్ని బాలూ పుట్టినరోజు సందర్భంగా అందరితో పంచుకుంటున్నాను.)

SPB Sanmanam 2012

 

మీ గాత్రం ఒక కొత్త శకానికి నాందీగీతం. ఏనాడైతే కోదండపాణీ వాత్సల్య వీక్షణాలు మీపై ప్రసరించాయో ఆనాడు సంగీతప్రపంచాన ఓ సరికొత్త రాగోదయమయ్యింది. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఎదురౌతుంటే, జగమంతా మురిసి అక్కున చేర్చుకుంది. ఆనాటి నుంచీ మీ పాటే ఎందరికీ సుప్రభాతమయ్యింది, భక్తిభావమయ్యింది. ఈల వేసింది, జోల పాడింది, ఓదార్చింది, ఉత్తేజపరిచింది. ప్రణయమయ్యింది, విరహమయ్యింది, విషాదమయ్యింది. నవరసాలలో నభూతో నభవిష్యతిగా ఎల్లరినీ ఓలలాడించింది. “పండితారాధ్యుల” వారి పాట పామరజనరంజకమయ్యింది. మీ కీర్తి హిమాలయ శృంగమయ్యింది. మీ పేరు మాత్రం చిన్నదై ఎస్పీబీగా, బాలుగా మా అందరి గుండెల్లో ఒదిగిపోయింది.

అది పాటా? కాదు, కాదు. దేవుడినైనా వశపరుచుకునే సమ్మోహనాస్త్రమే. వీనులకి అమృతపు విందే. మీ పాటలోని ఆ మధురిమ, ఆ స్పష్టత, ఆ తాదాత్మ్యత, ఆ రసపోషణ అనితరసాధ్యం. మీరు పాడుతుంటే పాటే మీరౌతారా అనిపిస్తుంది. సినీనటుల హావభావాలు, పాత్రోచిత గళవిన్యాసాలు మీ పాటలో అలవోకగా పలికి అబ్బురపరుస్తాయి. ఈ వైవిధ్యం మీకే సొంతం. బాలూ పాడలేని పాటలేదు, బాలూ పాడని సంగీత విశేషం లేదు అన్న నానుడి ముమ్మాటికి నిజం. సంగీతం నేర్చుకోని బాలూ, శంకరాభరణం శంకరశాస్త్రై సాక్షాత్తు శంకరుణ్ణే “విని తరించరా” అన్నప్పుడు యావత్ శాస్త్రీయసంగీత ప్రపంచం ముక్కున వేలేసుకుంది. తర్వాత చప్పట్లు చరిచి భేష్ భేషని పొగిడింది. ఊపిరి తీసుకోకుండా మీరు పాడిన ఇళయరాజా పాటకి లోకం ఊపిరి ఓ క్షణం పాటూ ఆగింది. మీరు “ఏ దివిలో విరిసిన పారిజాతమో” అని పాడినప్పుడు ఎన్ని లేతగుండెల్లో ఎన్ని ప్రణయపారిజాతాలు విరబూశాయో తెలుపతరమా? ఇలా వివరిస్తూ పోతే ఎన్నో ఎన్నెన్నో విశేషాలు మీ ప్రతిభని చెప్పకనే చాటిచెప్తాయి. సముద్రానికి సముద్రమే ఉపమానం అన్నట్ట్లు, మీకు పోలిక మీరే.

గతానికీ వర్తమానానికీ వారధిగా ఉన్న అతి కొద్ది మందిలో మీరూ ఒకరు. మీలో ఘంటసాలని చూసుకునే వారెందరో, త్యాగయ్యనీ అన్నమయ్యనీ చూసుకునే వారెందరో. మీ బహుముఖప్రతిభాశీలత్వం జగద్విదితమే కదా. “ఇది తొలి పాట” అంటూ సంగీత దర్శకుడిగా మీరు పూలబాట వేసుకుంటే, ఎన్ని బాణీముత్యాలు రాలాయో! నటుడిగా మీరు రంగు పూసుకుంటే వెండితర జిగేల్‌మనలేదూ? మీ గాత్రధారణ వల్ల ఎన్ని పాత్రలు జీవం పోసుకున్నాయో లెక్క లేదు. ఇలా ఎందరో ఎస్పీబీలు, అందరికీ వందనాలు!

మీ పాటే కాదు, మీ మాటా గొప్పదే. మీ మనసూ దొడ్డదే. “నేను బాధపడేది పాట పాడలేనినాడు కాదు, మనిషిగా బ్రతకలేని నాడని” ప్రకటించిన మీ మనిషితనాన్ని చూసి స్పందించని గుండె లేదు, హర్షించని మనసు లేదు. “పాడుతా తీయగా” పేరుతో మీరు నిర్వహించిన పాటల పోటీ మీ సంస్కారానికి, ఒక సత్సాంప్రదాయానికి అద్దం పట్టింది. ఎందరో గొప్ప సంగీతసాహిత్యకారులని జనాలకు పరిచయం చేసింది. ఎందరో చిన్నారులకు, యువజనులకు ప్రతిభావేదికయ్యింది. మీ పాట కోసమే కాదు, మీరు చెప్పే ఆసక్తికరమైన విషయాలూ, మంచి మాటల కోసం కూడా అందరు వేచి చూస్తారన్నది నిజం. అందుకే మీరు మనిషంత పాట, పాటంత మనిషి.

మీకు సన్మామంటే అది కమ్మని పాటకి సన్మానం. ఆ పాట కేవలం తేనె తెలుగు పాటే కాదు, యావద్భారత దేశపు పాట. కాదు కాదు, ప్రపంచమంతా విస్తరించిన పాట. అందుకే మీ పాట అందరి పాట, ఎల్లరినీ మురిపించే పాట. బృందావనం అందరిదీ అయినా, గోవిందుడు అందరి వాడైనా, ఉన్న గోవిందుడు ఒక్కడే కదా. అలాగే బాలూ ఒకరే. మీరు ప్రత్యేకం, మీ గానం అపురూపం, మీ గాత్రం మాకు బహుమానం. మీ పాట వినడం మా అదృష్టం. అందుకోండి మా వినమ్ర పాదాభివందనం.

ఇట్లు
శాండియాగో తెలుగు అసోషియేషన్ (శాంతా)

శివునితో ముడిపడిన పాము!

నాకు చిన్నప్పుడు శివుడంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. క్యాలెండర్‌లోని శివుడి రూపం గానీ, విన్న శివుడి కథలు గానీ, నన్ను ఆకట్టుకోలేదు. పైగా ఏదో తెలియని అయిష్టత ఏర్పడిపోయింది. నాకు ఎంతో ఇష్టమైన దేవుడు హనుమంతుడు! సిందూరం బొట్టు పెట్టుకుని, “జై వీరహనుమాన్”, “జై భజరంగభళీ” అంటూ తెగ ఉత్సాహంగా తిరిగే వాడిని. హనుమంతుడి ఫొటోలు, బ్యాడ్జీలు పెట్టుకుని పొంగిపోవడం, “హనుమాన్ చాలీసా” తప్పకుండా చదువుకోవడం నాకు ఎంతో ఇష్టమైన పనులు బాల్యంలో. 5th class దాటాక అనుకుంటా భక్తి పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. ఒక రోజు “హనుమ” అనే పుస్తకం కనబడితే కళ్ళకద్దుకుని చదవడం ప్రారంభించాను. మొదటి పేజీ లోనే – “….అలా శివుని అంశతో హనుమంతుడు జన్మించెను” అన్న వాక్యం చదివి మనసు విలవిలలాడింది. ఇంకా చదివితే హనుమంతుడు శివుని అవతారమే అన్నట్టు ఏదో ఉంది. వెంటనే పుస్తకం మూసేశాను. నాకు అత్యంత ఇష్టమైన హనుమంతుడు, అస్సలు గిట్టని శివుడూ ఒకరే అన్నది నేను జీర్ణించుకోలేకపోయాను. చాలా రోజులు బాధపడిన తర్వాత, ఒక పరిష్కారం కనుక్కున్నాను. పుస్తకం మొదటి చాప్టర్ వదిలేసి మిగతా పుస్తకం చదవాలి అని!

నిజానికి నా పుట్టుకలోనే శివుడితో ముడిపడిన విషయం ఒకటి ఉంది. నేను కడుపులో ఉన్నప్పుడు మా అమ్మకి కలలో పాములు కనిపిస్తే నాగేంద్రుడి పేరు పెడతానని మొక్కుకుంది. అందుకే ఫణీంద్ర అని పేరు పెట్టారు (ఫణి అంటే పాము). నేను పుట్టిన నక్షత్రం “ఆరుద్ర” కూడా శివుడి నక్షత్రం అని చెబుతారు. అయినప్పటికీ కూడా నాకు శివుడితో అంత సత్సంబంధాలు లేవు! దాదాపు 8th class వరకూ శివుడిపై అయిష్టత కొనసాగింది. తర్వాత శివుడిపై కొంత ఆసక్తి కలగడానికి చిత్రంగా తెలుగు సాహిత్యం దోహదపడింది.

ధూర్జటి మహాకవి విరచిత “శ్రీ కాళహస్తీశ్వర శతకం” లోని కొన్ని పద్యాలు తెలుగు పద్యవిభాగంలో ఉండేవి. “రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు”, “కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివేకుల్” వంటి పద్యాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి అంటే ఆ పద్యాలు నాపై చూపిన ప్రభావమే కారణం. ఈ పద్యాల్లో కనిపించే భక్తి, ఆ ఆర్తి చూసి “ఓహో, శివుణ్ణి కూడా ఇంతలా ఆరాధించేవారు ఉంటారా” అనిపించింది. అలా శివుడిపై సదభిప్రాయపు మొదటి బీజం పడింది.

ఆ బీజం మొలకెత్తడానికి మళ్ళీ సాహిత్యమే ఉపకరించింది, అయితే ఈసారి సినిమా సాహిత్యం. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో “సిరివెన్నెల” సినిమా పాటలు చాలా ఇష్టంగా పాడుకునే వాడిని. అందులో “ఆది భిక్షువు వాడినేది కోరేది?” అన్న సీతారామశాస్త్రి నిందాస్తుతి గీతం ఎంతో నచ్చేది. మా అమ్మమ్మ చాలా సార్లు నాతో ఈ పాట పాడించుకునేది. అలా పాడీ పాడీ కొంత శివుడంటే గౌరవం ఏర్పడింది. సినిమా పాటలంటే అన్నీ సిరివెన్నెలే రాస్తాడనుకుంటున్న రోజుల్లో, ఓ రోజు ఆయనే ఓ టీవీ ఇంటర్వ్యూలో వేటూరి గురించి చెప్తూ సాక్షాత్తూ శంకరుణ్ణే “విని తరించరా” అనగలిగే దమ్ములున్న వేటూరే నాకు ఇన్స్పిరేషన్ అనడంతో వేటూరి గురించి తెలిసింది. అలా శివుడి పుణ్యమా అని వేటూరికి సిరివెన్నెలకి అభిమానిగా మారాక తెలిసిన విషయం వాళ్ళిద్దరూ శివభక్తులే అని. వారిరువురూ రాసిన శివుడి గీతాలు నన్ను ఎంతో స్పందింపజేశాయి. “కైలాసాన కార్తీకాన శివరూపం, ప్రమిదేలేని ప్రమథాలోక హిమదీపం” అని వేటూరి అన్నప్పుడూ, “ఖగోళాలు పదకింకిణులై పదిదిక్కుల ధూర్జటి ఆర్భటి రేగ” అని సిరివెన్నెల అన్నప్పుడూ, ఆ పాటలు నేను విన్నప్పుడు మనసు అదో విధమైన భక్తిభావానికి లోనయ్యేది. అలా ఎన్ని శివుడి పాటలో!

పెరిగి పెద్దయ్యాక శివభక్తుణ్ణి అయిపోలేదు, శివతత్త్వమూ బోధపడలేదు. కానీ శివుడితో కొంత అనుబంధమూ, మనసులో శివుడంటే ఓ ప్రత్యేకతా ఏర్పడ్డాయి. పెళ్ళయ్యాక అనుకోకుండా “ఈశా ఫౌండేషన్” వారి Inner Engineering కోర్స్ చెయ్యడం, తద్వారా సద్గురువు బోధనలు వినడం జరిగాయి. అంతక ముందు నాకు ఈశా గురించి, సద్గురువు గురించి అస్సలు తెలీదు. శివుణ్ణి ఆదియోగిగా, రాజయోగ మార్గాన్ని ప్రపంచానికి అందించిన గొప్ప ఆధ్యాత్మిక గురువుగా సద్గురువు చెబుతారు. మళ్ళీ శివుడే!

ఈశా ఆశ్రమంలోని ధ్యానలింగం మహా ఆధ్యాత్మిక దీపమే అని చెబితే సరే చూద్దామని “ఆదియోగి ఆలయం” ప్రాణప్రతిష్టకి కొయంబత్తూరు ఆశ్రమానికి మొదటిసారి వెళ్ళాను. కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు రోజే వెళ్ళడంతో సాయంత్రం ఖాళీ దొరికితే ధ్యానలింగాన్ని దర్శించుకున్నాను. మామూలు గుడిలో శివలింగాన్ని చూసిన అనుభూతే కలిగింది, పెద్ద గొప్పగా అనిపించలేదు. బసకి తిరిగి వచ్చేస్తూ ఉంటే ఏదో ఊరేగింపుగా జనసందోహం వస్తూ కనిపించింది. ఏమిటో చూద్దామని ఆగాను. ఈశా బ్రహ్మచారులు ఏదో సంస్కృత శ్లోకం పాడుతూ నా దగ్గరగా వచ్చారు (అది ఆదిశంకర విరచిత నిర్వాణ-షట్కం అని తర్వాత తెలిసింది). ఆ గానంలో ఏదో మంత్ర శక్తి ఉందనిపించింది. వెనుక ఎవరొస్తున్నరబ్బా అని చూస్తే ఓ ఎద్దుల బండీ, ఆ బండిపై ఓ శివలింగం ఊరేగింపుగా తీసుకువస్తున్నారు. ఇదేదో వింతగా ఉందే అనుకుంటూ ఉండగా వింతల్లో వింత – ఆ ఎద్దులబండిని నడుపుతున్నది సద్గురువే! సద్గురువుని అంతకముందు ఒక సారి చూసినా, అంత దగ్గరగా చూడడం అదే మొదటి సారి. నిర్వాణ షట్కపు మంత్రధ్వనుల మధ్య, గంభీర వదనంతో, నల్లబట్టలు ధరించిన సద్గురువు. ఆ రూపంలో ఏదో మహాతేజస్సు కనిపించింది! నేను అవాక్కై చూస్తుండగా ఎద్దులబండి ముందుకు కదిలిపోయింది. వెంటనే ఏమయ్యిందో తెలియదు, నేనూ బండి వెనుక పరిగెత్తడం మొదలుపెట్టాను! తర్వాత గమనిస్తే చాలా మంది నాలాగే పరిగెడుతున్నారు. చెప్పులు తీసెయ్యడంతో కాళ్ళకి గులకరాళ్ళు గుచ్చుకుంటున్నాయి. అయినా ఆగకుండా దారిలో బారికేడ్లూ అవీ దాటుకుని (ఈశా వాలంటీర్లు వారిస్తున్నా వినకుండా), గోడలు గట్రా దూకి అందరితో పాటూ నేనూ ముందుకు ఉరుకుతున్నాను. ఒకటే ధ్యాసా, లక్ష్యం. సద్గురువుని చూడాలి. మిగతా వాళ్ళ సంగతి తెలియదు కానీ, నా మటుకు ఆ స్థితిలో “సద్గురువు” అంటే “జగ్గీ వాసుదేవన్” కాదు. ఓ దివ్యత్వం, మహాతేజస్సు, బహుశా సాక్షాత్తూ శివుడే!

తర్వాత ఆలోచిస్తే నాకే ఆశ్చర్యం వేసింది. నాకు అట్టే భక్తిభావం లేదు, గుళ్ళూ గోపురాలకి పెద్ద వెళ్ళింది లేదు. నాకున్న అహానికి సద్గురువుని గురువుగా అంగీకరించినదీ లేదు (అప్పటికీ, ఇప్పటికీ)! నేను ఎమోషనల్ పర్సన్‌నీ కాదు. అయినా ఎందుకు ఆ రోజు అలా పరిగెత్తాను? ఇది నా తర్కానికి అందని ప్రశ్న. ప్రశ్నలన్నీ కరిగేటప్పుడు, నాలోని నేను హరించేటప్పుడు, అప్పుడప్పుడూ కొంచెం సేపు ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు బహుశా శివతత్త్వం రేఖామాత్రంగా నాకు అవగతమయ్యిందని భావిస్తాను. ఓం నమశ్శివాయ!

అత్తారింటికి దారేది – సెంటిమెంటు దారంపై అల్లిన హాస్యసుమాల మాల

త్రివిక్రం, పవన్‌కళ్యాణ్‌ల “జల్సా” చూసిన తర్వాత, ఆ కాంబినేషన్‌పైన నా అంచనాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కాబట్టి “అత్తారింటికి దారేది” సినిమా పైన నేను పెద్ద ఎక్కువ ఆశలు పెట్టుకోలేదు. కానీ చూడగా కాసేపు సరాదాగా నవ్వుకునేలానే ఉంది సినిమా.

కొన్ని ఫ్రేముల్లో తన వయసు కనిపిస్తున్నా, చాలా మటుకు సమంతా-ప్రణీతలకి సరిజోడైన నవయువకుడిలానే పవన్‌కళ్యా్‌ణ్ మెరిశాడు. అభిమానులని అలరిస్తాడు, మిగతావాళ్ళని మురిపిస్తాడు. ముగ్ధమనోహరంగా కనిపించిన అమ్మాయి పేరు “ప్రణీత” అని తరవాత తెలిసింది. ఆ అమ్మాయి గురించి పవన్‌కళ్యాణ్ కొన్ని డైలాగులు చెబుతాడు, దానికి తగ్గట్టే ఉంది. సమంతా ఎప్పటిలాగే బానే చేసిందనిపించింది. నిజానికి ఈ సినిమాలో female-leads కి పెద్ద ఏక్షన్ స్కోప్ లేదు. పవన్‌కళ్యాన్‌దే One Man Show అనిపిస్తుంది.

త్రివిక్రం తనదైన శైలిలో ఈ సినిమాలో కూడా ప్రేక్షకులని నవ్వించడంలో సఫలం అయ్యాడు. ఫిలాసఫీలు చెప్పనంతవరకూ, గొప్ప జీవితసత్యాల గురించి మాట్లడనంత వరకూ త్రివిక్రం నాకు నచ్చుతాడు. ఈ సినిమాలో సెంటిమెంటు సీన్లలో సైతం పెద్ద పెద్ద లాజిక్కుల జోలికి పోకుండా సింపుల్‌గా రాశాడు. నచ్చాడు. ఆలీ, బ్రహ్మానందం, M.S.నారాయణ మొదలైన హాస్యబృందంతో మంచి నవ్వులనే పూయించాడు.

నిజానికి సినిమాలో మంచి సందేశం ఒకటి ఉంది, సెంటిమెంటూ ఉంది. కానీ వీటిని కేవలం స్పృశిస్తూ సినిమాని కామెడీతోనే నడిపించాడు త్రివిక్రం. క్లైమాక్సులోని సీన్ టచింగ్‌గా అనిపించింది. మిగతా కొన్ని సీన్లలో ఎమోషన్ రావాలని తెలుస్తూ ఉంటుంది కాని నాలో ఎమోషన్ కలిగేంత involvement రాలేదు. స్క్రీన్ పైన ఆలీ పవన్‌కళ్యాణ్ గొప్ప త్యాగం చేస్తున్నట్టు కన్నీళ్ళతో కనిపిస్తున్నాడు, కాని నాలో ఏ ఫీలింగూ లేదు! అలాగే పవన్‌కళ్యాణ్ – సమంతా మధ్య లవ్ ఏంగిల్ పెద్ద ఏమీ ఎస్టాబ్లిష్ అయినట్టు తోచదు. వినోదమే ప్రధానంగా సాగే కథనంలో ఏవో అనుబంధాలు, ప్రణయాలు, సుభాషితాలు వచ్చిపోతూ ఉంటాయి.

సంగీతపరంగా దేవీశ్రీ మార్కులు కొట్టేస్తాడు. గొప్ప పాటలు అనిపించలేదు కానీ, మొదటి సారి వింటేనే బావున్నాయనిపించే 3-4 పాటలు ఇచ్చాడు. తనే సాహిత్యం రాసిన పాటలో మంచి రచయితగా మరో సారి రుజువు చేసుకున్నాడు. ఇలా సరదా పాటలకే కాకుండా “కలుసుకోవాలని” చిత్రంలో రాసినట్టు “ఉదయించిన సూర్యుడినడిగా” లాంటి ఇతర గీతాలు కూడా దేవీశ్రీ నుంచి వస్తే శుభపరిణామమే. టైటిల్ సాంగులో కొత్త కురాడు “శ్రీమణి” తన ప్రతిభని బానే ప్రదర్శించాడు. పాట అంతా మంచి భావాలతో, కవిత్వంతో వెళుతూ ఉంటే మధ్యలో “ఆరడుగుల బుల్లెట్టు, ధైర్యం విసిరిన రాకెట్టు” అంటూ ఇంకో ఫీల్‌లోకి తీసుకెళ్ళే పంచ్ లైన్ రావడమే నాకు నచ్చలేదు. కొన్ని పదప్రయోగాలలో ఇంకా పరిణతి రావాలి శ్రీమణిలో. తాను మాత్రమే రాయగలిగిన చమక్కులతో రామజోగయ్య మెరుస్తారు. “బాపు గారి బొమ్మో” పాటలో సాహిత్యం దేవిశ్రీ ఆ లేక రామజోగయ్యా అని సందేహం వచ్చినా, జాగ్రత్తగా గమినిస్తే రామజోగయ్య మార్కు కనిపెట్టొచ్చు. ఏదేమైనా సినిమాపాటల్లో కవిత్వానికి కాలం చెల్లిందనిపిస్తోంది. ఇక “చమక్కుల” తోనే సరిపెట్టుకోవాలి. అవే అందరికీ అర్థం అవుతున్నాయి, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు.

హాయిగా నవ్వుకోడానికి, మంచి టైం పాస్ అవ్వడానికి ఈ సినిమా తప్పకుండా చూడొచ్చు అనిపించింది. ఇది గొప్ప సినిమా కాదు. మంచి సినిమా అనొచ్చు కాని “సరదా సినిమా” అనడం ఇంకా సబబేమో. వల్గారిటీ లేకుండా కుటుంబసమేతంగా చూసేలా తీసిన త్రివిక్రంని అభినందించొచ్చు.

ఆ ముగ్గురు…

కొత్తపాళీ గారు మూడేళ్ళ క్రితం తను రాసిన బ్లాగులో ఒక ఆసక్తికరమైన చర్చకి తెరతీశారు. తమతమ రంగాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ముగ్గురిని ప్రస్తావించి వారు మిమ్మల్ని ఎలా “ప్రభావితం” చేశారో, వారెందుకు గొప్పో తెలపాల్సిందిగా కోరారు. ఆ ముగ్గురూ –

 1. యండమూరి
 2. సిరివెన్నెల
 3. ఇళయరాజా

ఈ ముగ్గురి సృజనలనీ అంతో ఇంతో ఆస్వాదించిన వాడిని కనుక, మూడేళ్ళు లేటుగా అయినా,  నా స్పందన కొంత.

యండమూరి – నాకు యండమూరి పరిచయమయ్యింది self help పుస్తకాల ద్వారా. personality development పుస్తకాలంటే ఒకప్పుడు నాకు చాలా ఆసక్తి ఉండేది. “అయాన్ రాండ్” గురించి యండమూరి పుస్తకంలోనే మొదటి సారి చదివాను. ఆయన రాసిన self-help పుస్తకాలు దాదాపు అన్నీ చదివాను అనుకుంటా. కొన్ని నవలలూ, కథలూ కూడా చదివాను. నవలా రచనలో వాణిజ్య పరమైన అంశాలు ఎక్కువ ఉంటే కథల్లో మటుకు నిజాయితీ కనిపిస్తుంది. అందుకే యండమూరి కథలు ఎక్కువ నచ్చాయి నాకు.

యండమూరి పుస్తకాలు ఎక్కువ ముద్రించే పబ్లిషర్‌ది (పేరు గుర్తులేదు) విజయవాడ. నేను సిద్ధార్థా ఇంజనీరింగ్‌లో చదివే రోజుల్లో, విజయవాడ పుస్తక ప్రదర్శనకి ప్రతి సంవత్సరం వెళ్తూ ఉండే వాడిని. ఒక ఏడు యండమూరి పుస్తకాల స్టాలులో ఒక చిన్న పుస్తకం (“కవితా ఓ కవితా” అని కొన్ని కవితానువాదాలు ఉన్న పుస్తకం. నాకు యండమూరి అనువాద శైలి అంత నచ్చలేదు) కొంటే ఆ పుస్తకానికి లక్కీ డ్రాలో ఓ ఫ్రిజ్ తగలడం గమ్మత్తైన అనుభవం. ఇలా యండమూరి ద్వారా నేను “లాభపడ్డాను” కూడా!

ఆంగ్లంలో ఉన్న రచనలని గానీ, కొన్ని మంచి విషయాలని గానీ, తెలుగుదనం కూర్చి, తెలుగువారికి నచ్చేలా అందించడంలో యండమూరి దిట్ట. ఒక మిత్రుడు జోక్ చేసినట్టు – “స్టీవెన్ కొవే The Seven Habits of Highly Effective People అంటే యండమూరి దానినే “విజయానికి ఐదు మెట్లు” అన్నాడు. తర్వాత ఆయన “The Eighth Habit” రాస్తే యండమూరి వెంటనే “విజయానికి ఆరో మెట్టు” రిలీజ్ చేశాడు! “. ఇది personality development పుస్తకాల్లోనే కాక నవలల్లోనూ (“ప్రార్థన” నవల, రాబిన్ కుక్ నవలకి స్వేచ్ఛానువాదం అని యండమూరే అన్నట్టు గుర్తు), కథల్లోనూ కూడా కనిపిస్తుంది (“దుప్పట్లో మిన్నాగు” అనే ఒక థ్రిల్లర్ కథల సంపుటిలో ఒకటి రెండు కథలు ఒక ఆంగ్ల కథా రచయిత రాసిన కథలకి కాపీ అని నేను తర్వాత గ్రహించాను) . యండమూరి కొన్ని సార్లు చెప్పి, కొన్ని సార్లు చెప్పకుండా కాపీ చేసినట్టు తోస్తుంది. అయితే యండమూరిని నేను “కాపీ రచయిత” అనో, “టాలెంట్ లేదనో” అనను. ఈయన గొప్ప ప్రతిభావంతుడేనని నాకు అనిపిస్తుంది. ఆయన రచనలు మంచి time-pass. అంతో ఇంతో మెదడుకి మేత. యండమూరి రాసిన కొన్ని వాక్యాలు నా మనసులో ముద్రించుకుపోయాయి. అవి యండమూరి సొంతం కాకపోవచ్చు, కానీ నేను తెలుసుకున్నది యండమూరి ద్వారానే కాబట్టే ఆయనకే క్రెడిట్ ఇస్తాను.

సిరివెన్నెల – గీత రచయితల్లో నాకు సిరివెన్నెల పాటల కన్నా వేటూరివి ఎక్కువ నచ్చుతాయి. కాని నేను “గురూజీ” అని పిలుచుకునేది సిరివెన్నెలనే. “నాలోని కవిని ఫిలాసఫర్, ఫిలాసఫర్‌ని మనిషి డామినేట్ చేస్తారు” అని స్వయంగా ఒకసారి మా మిత్రబృందానికి చెప్పారు. ఈ స్టేట్మెంట్‌లో మొత్తం విషయం ఉంది. అందుకే ఆయన పాటల్లో కవిత్వం కన్నా ఫిలాసఫీ ఎక్కువ కనిపిస్తుంది. ఆ ఫిలాసఫీ వల్లనే ఎందరో ఆయనకి అభిమానులు అయ్యారు. ఆయన ప్రేరణతో తమ జీవితాల్ని తీర్చిదిద్దుకున్న వారిని నేను చూశాను. నేను ఫిలాసఫీ అంతో ఎంతో నేర్చుకున్నది స్వామీ వివేకానంద,జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాల నుంచీ. సిరివెన్నెల పైన జిడ్డు కృష్ణమూర్తి ప్రభావం ఉన్నట్టు తోస్తుంది (“ప్రశ్నలోనే బదులు ఉందే, గుర్తుపట్టే గుండెనడుగు” వంటివి జిడ్డు కృష్ణమూర్తి పదే పదే చెప్పిన విషయాలు). ఒక సారి మాతో “మీకు జిడ్డు కృష్ణమూర్తి తెలుసా” అని అడగడం ఈ అభిప్రాయనికి కొంత బలం చేకూరుస్తోంది. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే నేను సిరివెన్నెల పాటల్లోని ఫిలాసఫీని అంతక ముందే చదివి ఉండడం వలన, ఆయన పాటలు విని కొత్తగా నేర్చుకున్న విషయాలు పెద్ద లేవు. అయితే తెలిసిన విషయాలనే సిరివెన్నెల చాలా గొప్పగా చాలా సార్లు చెప్పారు. ఉదాహరణకి నాకు ఎంతో నచ్చే ఈ వాక్యాలు –

బతకేందుకు చంపమనీ, చంపేందుకు బతకమనీ నమ్మించే అడివిని అడిగేం లాభం బతికే దారెటనీ? 

సంహారం సహజమనీ, సహవాసం స్వప్నమనీ, తర్కించే తెలివికి తెలియదుగా తానే తన శత్రువనీ!

సిరివెన్నెల తన పాటల్లోని ఫిలాసఫీని అందరూ తెలుసుకోవాలనీ, తన పాటలు ఏదో మాధుర్యం కోసమో, ఆహ్లాదం కోసమో మాత్రమే కాక జీవితానికి పనికి వచ్చేలా ఉండాలనీ, అలాంటి పాటలపైనే ఎక్కువ దృష్టి పెట్టమనీ మాకు చెప్పేవారు. నేను పాటల్లో కోరుకునేది కవిత్వం కనుక నాకు లాజిక్కులు అవీ పెద్దగా లేని వేటూరి పాటలు ఎక్కువ నచ్చుతాయి. అయితే సిరివెన్నెల గొప్పగా కవిత్వం రాసిన పాటలు కోకొల్లలు. మచ్చుకి కొన్ని –

 • వడగాలే విడిదైన ఎదలోయలో ఇలా, పూదోట విరిసేలా పన్నీటి వర్షాలా!
 • అల్లుకున్న బంధాలు చల్లుకున్న చందనాలు వెల్లువైన వేళలో మనది పూలదారే!
  నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని
 • నీతో నడిచిన ప్రతి అడుగులో చూశాను మన రేపుని

సిరివెన్నెల చాలా మందికి అర్థం అవుతాడు. ఆయన భావాలు సాహిత్యం అంటే పట్టని వాళ్ళని కూడా తాకుతాయి. అది ఆయన గొప్పతనం. నాకు రెండు సంఘటనలు ఎప్పుడూ గుర్తొస్తాయి

 1. మా బాబయ్య కూతురు ఒకమ్మాయి, అప్పుడు దానికి పదేళ్ళు ఉంటాయనుకుంటా. “వర్షం” సినిమా ట్రైలర్ వస్తోంది టీవీలో. “ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వానా…..అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా” అన్న సాహిత్యం. నేను cute సాహిత్యం అని మనసులో అనుకుంటూ ఉంటే, మా చెల్లెలు పైకి అన్న మాటలు – “అబ్బా! ఆశ దోశ అప్పడం. వాన నీతో ఉండిపోవాలనే!”
 2. విజయవాడ సిద్ధార్థాలో రెడ్డి అనే స్నేహితుడు ఉండేవాడు. పల్లెటూరి నుండి వచ్చినవాడు. సినిమాలు బాగా చూసేవాడు. చూసి అందరికీ భలే వివరించేవాడు. ఈ కాలం భాషలో చెప్పాలంటే “mass audience”కి మంచి ప్రతినిధి. అప్పుడే “నువ్వు నాకు నచ్చావ్” సినిమా వచ్చింది. అందులో “ఒక్కసారి చెప్పలేవా” పాట గొప్పతనం గురించి “హాసం” పత్రికలో వ్యాసం చదివి “ఆహా అద్భుతం” అనుకున్నాను. కొన్ని రోజులు పోయాక రెడ్డీ, నేను కూర్చుని మాట్లాడుకుంటుంటే ఈ సినిమా గురించి చర్చ వచ్చింది. రెడ్డి తన శైలిలో కథ చెప్తున్నాడు – “… ఇలా ఇద్దరూ ఇష్టపడినా పైకి చెప్పరు. వెంకటేష్ మనని తొక్కలో లాజిక్కులతో చావగొడుతూ ఉంటాడు. అప్పుడే ఒక పాట కూడా వస్తుంది. అందులోనూ మనవాడు తగ్గడు. నువ్వు చందమామ అనీ, పైన ఎక్కడో కూర్చున్నావు కాబట్టి నాకు అందవనీ, అయినా ఏదో చిన్నపిల్లలు చండమామని చూసి ముచ్చటపడినట్టు నీతో సరదాగా గడిపాననీ మహా లాజిక్ ఒకటి తీస్తాడు!”

ఇలా సాహిత్యం వాసనే పట్టని వారిని కూడా చుట్టుకున్నసిరివెన్నెల పాటల మహత్యం నన్ను అబ్బురపరుస్తుంది!

ఇళయరాజా – నాకు మెలొడీ పాటలన్నా, మంచి సాహిత్యం ఉన్న పాటలన్నా ఇష్టం. నాకు ఇష్టమైన మెలొడీ, ఇష్టమైన సాహిత్యం కుదిరిన పాటల్లో ఇళయరాజా పాటలు చాలా ఉన్నాయి. అందుకే ఇళయరాజా అంటే నాకిష్టం (ఇంకో ఇష్టమైన సంగీత దర్శకుడు రెహ్మాన్). ఇళయరాజా అదృష్టవంతుడు అనిపిస్తుంది, మెలొడీ రాజ్యమేలిన రోజుల్లో ఇళయరాజా కూడా పీక్‌లొ ఉండడంతో ఎన్నో ఆణిముత్యాలు వెలువడ్డాయి. ఇంకొక విషయం ఏమిటంటే ఇళయరాజా పాటలు పాడుకోడానికి సులువుగా ఉంటాయి (చాలా వరకూ). ఏ మ్యూజిక్కూ లేకుండా మనకి మనమే పాడుకుని కూడా మంచి ఫీల్ పొందొచ్చు (రెహ్మాన్ పాటల్లో ఈ సౌలభ్యం అంత కనిపించదు నాకు. రెహ్మాన్ మెలొడీతో మొదలైనా మెలొడీలు చేసే అవకాశాలు తర్వాత తర్వాత తక్కువే వచ్చాయి)

ఇళయరాజా పాటల్లో నన్ను ఎంతో స్పందింపజేసిన పాటలు చాలా ఉన్నాయి. “ఏ నావదే తీరమో” పాట చాలా ఇష్టం. నాకు శాస్త్రీయ సంగీతం అంటే నచ్చదు అనుకునే వాడిని, ఇళయరాజా పాటలు (“నాదవినోదము నాట్యవిలాసము”, “అందెల రవమిది” ఇత్యాదులు) విన్నాక ఆ అభిప్రాయం మారింది. ఇళయరాజా పాటల్లో సింప్లిసిటీ ఎక్కువ కనిపిస్తుంది, అది నాకు నచ్చుతుంది. ఒక స్నేహితుడు నాతో – “ఇళయరాజా పాటలు గిన్నెలు బోర్లించి కొట్టినట్టు ఒకేలా ఉంటాయి.  రెండు మూడు instruments తప్ప వాడడు” అన్నాడొక సారి. నేను నవ్వుకున్నాను. సంగీతం బాగా తెలిసిన మిత్రుడొకనితో ఈ విషయం ప్రస్తావిస్తే – “బాసూ! ఇళయరాజా వాడని instrument లేదు. సింఫనీలో అదరగొడతాడు. instruments అంతలా sync అయిపోతాయి కనుకనే నీకు ఎక్కువ ఉన్నట్టు అనిపించవు. కొన్ని పాటలకి ఆయన వాయించినట్టు మనం వాయించాలంటే ఈ జన్మ సరిపోదు” అన్నాడు. నాకు సంగీతం గురించి అస్సలు తెలీదు. అయితే నా మనసు ఎగిరి గంతేసినది, ఉప్పొంగి పోయినది, కన్నీటి సంద్రమయినదీ, సెలయేటి గీతమయినదీ ఇళయరాజా పాటల్లోనే.

“ఇళయరాజా కాపీ కొట్టాడు” అన్న మాట బోలెడు సార్లు విన్నాను. రెహ్మాన్ గురించి కూడా ఇదే అంటారు. రెహ్మాన్, ఇళయరజా వంటి వారి తమ గొప్పతనాన్ని ఎప్పుడో చాటుకున్నారు. వాళ్ళు అక్కడో ఇక్కడో కొంత కాపీ కొట్టారు అనుకున్నా, కేవలం ఆ వంకతో వారిని తీసి పారెయ్యలేము. కాసేపు మబ్బు వెనకాల దాగినంత మాత్రాన సూర్యుడు తేజప్రకాశుడు కాకుండా పోడు!

ముగింపు – కొత్తపాళీ గారి అసలు ప్రశ్న – “వీరిలో గొప్పతనం ఏమిటి”? చల్లగాలి తాకాలంటే కిటికీ తెరుచుకోవాలి. మూసుకుని ఉన్న కిటికీలు కొన్ని సార్లు చిన్న గాలికే తెరుచుకుంటాయి, కొన్నిసార్లు పెనుగాలికి కూడా చలించవు. ఎందుకంటే, ఎలా చెప్పాలి? connect అవ్వడం అని వాడుతూ ఉంటారు. ఏ బంధం ఎప్పుడు తగులుకుంటుందో తెలియదు కానీ, కొన్ని మనని అలా అతుక్కుంటాయి. “అవధి లేని ప్రతి అనుభూతికీ ఆత్మానందమే పరమార్థం” అని సినారే చెప్పినట్టు, మనలోని ఆత్మసౌందర్యాన్ని వెలికితీసిన కళాకారుడెవరైనా వందనీయుడే, గొప్పవాడే.

జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః!

మేధావులూ – విమర్శకులూ – ఓ సామాన్య సినీ ప్రే క్షకుడు

నీకు జిలేబీ నచ్చకపోతే, నాకు జిలేబీ నచ్చదని చెప్పు. అంతే కానీ జిలేబీ బాగోదు, జిలేబీ వేస్టు అని అన్నావంటే జిలేబీ నచ్చినవాడికో చేసినవాడికో కాలుతుంది"

– సిరివెన్నెల సీతారామ శాస్త్రి

ఈ మాటల నుంచి కొన్ని విషయాలు గ్రహించొచ్చు –

1. ప్రతివాడికీ అభిప్రాయాలు ఉంటాయ్ (subjectivity)
2. అభిప్రాయాలని objective గా చెప్పడం మనకి అలవాటై పోయింది
ఉదా: ఈ సినిమా చెత్తగా ఉంది (అసలు: ఈ సినిమా నాకు నచ్చలేదు)
ప్రియా, నువ్వు లేకపోతే జీవితం లేదు (అసలు: నువ్వే నా జీవితమని అనిపిస్తోంది)
3. ప్రతీదీ subjective అయితే మరిక objective అంటూ ఏమీ లేదా? మరప్పుడు "రామాయణం విష వృక్షమా, కల్పవృక్షమా తేలేదెలా? శంకరాభరణం గొప్ప సినిమానా, లేక కేవలం మంచి సినిమానా, లేక రెండూ కాదా అన్నది ఎలా తెలుస్తుంది? అవార్డ్ సినిమాలు "అయ్య బాబోయ్" ఆ లేక "బాగు బాగోయ్" ఆ అన్నది ఎలా నిర్ణయించగలం? ముచ్చటైన ఈ మూడవ ప్రశ్నని కొంత చర్చించడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.

objectivity గురించి సమగ్రంగా చర్చించాలంటే నా పరిమితులు అడ్డం వస్తాయ్ కాబట్టి కేవలం సినిమాల గురించే మాట్లాడుకుందాం. Dead poets society అనే సినిమాలో ఒక ఇంగ్లీష్ టీచరు పిల్లలని Poetry పాఠ్యపుస్తకం తీసి పరిచయ వ్యాసం చదవమంటాడు. "కవిత గొప్పతనం గుర్తించడం ఎలా?" అనే ఆ వ్యాసాన్ని ఒక Phd Scholar రాస్తాడు. ముందు కవితలో వస్తువు, ఉదాత్తతని X axis పై మార్కు చెయ్యాలి. తర్వాత ఆ కవితని కవి ఎంత బాగా రాశాడో Y axis పై మార్కు చెయ్యాలి. ఇలా చెయ్యగా వచ్చిన area కవిత గొప్పతనం అని ఆ వ్యాసంలో ఉంటుంది. పిల్లలని వెంటనే ఆ వ్యాసం పేజీలు చింపెయ్యమంటాడు టీచరు. కవిత్వాన్ని analyze చెయ్యకూడదు, అనుభూతి చెందాలి అని పిల్లలకి బోధిస్తాడు.

కవిత్వం లాగే సినిమాని కూడా అనుభూతి చెందడం వేరు, analyze చెయ్యడం వేరు. analysis పేరుతో, భావజాలం పేరుతో సినిమాని చీల్చి చెండాడేసి సినిమా గురించి అద్భుతంగా చర్చించుకున్నాం అనుకుంటే సరిపోదు. analysis అన్నది క్రికెట్ commentary లాటిది. క్రికెట్ చూసే సగటు ప్రేక్షకుడు commentary లేకుండా కూడా క్రికెట్ ఎంజాయ్ చెయ్యగలడు. మరి commentary ఎందుకు? సగటు ప్రేక్షకుడు చూడని, అతనికి తెలియని విషయాల గురించి తెలిపి, అతని చేత "ఓహో" అనో, "ఆహా" అనో, "అవును కదూ" అనో అనిపించి, అతని అనుభూతి పెంచేలా చెయ్యడం కోసం. ఇది చెయ్యాలంటే commentator కి సగటు ప్రేక్షకుడి కంటే ఎక్కువ knowledge, observation, విశ్లేషణా ఉండాలి. అంత మాత్రాన commentator, "నాకే ఎక్కువ తెలుసు. నేను చెప్తున్నదే క్రికెట్. నేను చూస్తున్నదే ఆట. మిగతా వాళ్ళు అలా చూడలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి జ్ఞానం ప్రాసాదించమని దేవుణ్ణి కోరుకుంటున్నాను" లాంటి అహంకారానికి లోను కాకూడదు. అలాగే నా దృక్కోణమే కరెక్ట్ మిగతాది trash అనుకోకుడదు. అలాగే నా దృక్కోణం మిగతా వాటి కంటే ఉన్నతమైనది, విశాలమైనది, logically sound లాంటి assumptions లోనూ ఉండకూడదు. వీటన్నిటి వల్లా commentary లోనే ఉండిపోయి అసలు ఆటని మర్చిపోయే ప్రమాదం ఉంది. పైగా నా view point కరెక్ట్ అంటే కాదు నాది కరెక్ట్ అంటూ లేనిపోని తర్జనభర్జనలూ, అర్జున గర్జనలకి దారితీసే అవకాశం ఉంది.

కాబట్టి, సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యి, అతని అనుభూతిని పెంచేంతవరకూ ఈ విశ్లేషణల వల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఆవేశాలకీ, సెంటిమెంట్లకీ లోను కాకుండా objective గా ప్రేక్షకుడు ఉంటే నేను చెప్పేదాంట్లో నిజం గ్రహిస్తాడు లాంటి డైలాగ్లూ కరెక్ట్ కాదు. ఎందుకంటే communication is about receiver, not sender. సగటు ప్రేక్షకుడికి తనదైన దృక్కోణాలూ, అభిరుచులూ ఉంటాయ్ కాబట్టి, అవి ఉన్నా తన సందేశాన్ని ఎలా చేరవేయాలో ఆలోచించాలి కాని అవి లేకపోతే నేను చెప్పేది అర్థమయ్యేది అనడంలో పాయింటే లేదు.

చివరిగా Ratatouille సినిమాల్లో ఒక critic తను ఇన్నాళ్ళు చేసిన పొరబాటుని గ్రహించి చెప్పే మాటలని ప్రస్తావిస్తూ ఈ వ్యాసాన్ని ముగిస్తాను-

In many ways, the work of a critic is easy. We risk very little, yet enjoy a position over those who offer up their work and their selves to our judgment. We thrive on negative criticism, which is fun to write and to read. But the bitter truth we critics must face is that in the grand scheme of things, the average piece of junk is probably more meaningful than our criticism designating it so. But there are times when a critic truly risks something and that is in the discovery and defense of the new. The world is often unkind to new talent, new creations. The new needs friends.

స్లం డాగ్ మిలియనీర్

స్వాతి మాసపత్రికలో  మాలతీ చందూర్ గారు Q and A అన్న నవల గురించి రాశారు. నాకు నవలలోని విషయం కన్నా నవల కథనం బాగా నచ్చింది. "సినిమా తియ్యొచ్చు" అనుకున్నా వెంటనే, ఈ లోపు వ్యాసం చివరలో చందూర్ గారు రాశారు "ఈ నవల ఆధారంగా Slumdog Millionaire అనే సినిమా తీశారు అని. ఇలా మొదటిసారిగా ఈ సినిమా గురించి వినడం జరిగింది. అప్పటికి ఈ సినిమా అంత popular కాలేదు (release కూడా కాలేదేమో బహుశా). తర్వాత చూస్తే ఏముంది, ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే – రెహ్మాన్ కి Golden globe, అంతర్జాతీయ ప్రశంసలు, కలక్షన్ల రికార్డులు, ఆస్కార్ నామినేషన్….అబ్బో! పెద్ద సంచలనమే సృష్టించింది ఈ సినిమా. అయితే ఈ సినిమాకి కొన్ని విమర్శలు కూడా వచ్చాయి – ముఖ్యంగా మన దేశం నుంచి. ఈ విమర్శల గురించీ, ఈ సినిమా పై నా అభిప్రాయం గురించీ చెప్పడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.

"ఈ మధ్య నేను చదివిన నవలల్లో నన్ను బాగా కదిలించి, నిద్రపట్టకుండా చేసిన నవల" ఇది అని రాశారు మాలతీ చందూర్ గారు. ఈ సినిమా గురించి నేను చదివిన reviews లో కూడా ఇదే ఉంది. ఇవి చదివి ఒకింత ఉత్సాహంతో DVD లో ఈ సినిమా చూశాను. చక్కటి సినిమానే అనిపించింది. కథా, కథనం, నటనా, సంగీతం బాగా కుదిరాయ్. అయితే నాలో గొప్ప అనుభూతి గానీ, ఇది అద్భుతమైన చిత్రం అనే భావన గానీ ఏమీ కలగలేదు. ఇందులో Real India అని చూపించిన India, real అని ఒప్పుకోక తప్పదు. మన దేశంలోని slums లో జీవనాన్ని, మత కల్లోలాలనీ, పేదరికాన్ని, అన్యాయాన్ని చూపించారు. అయితే సినిమా కథనం వేగంగా ఉండడం వల్ల ఇవన్నీ అలా కనిపించి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది, మనలో పెద్ద స్పందన ఏమీ కలగజేయకుండానే. మిగతా దేశాల వాళ్ళ మాటేమో గానీ, మనకి మాత్రం ఈ reality అంతా తెలిసినదే. అయితే మొత్తం reality ఇదే కాదనీ, ఈ సినిమాలో చూపించని India కూడా ఉందనీ సగటు భారతీయుడికి ఎవరికైనా తెలుస్తూనే ఉంటుంది, సినిమాలో ఈ other reality గురించి ఊసైనా ఎత్తకపోయినా. ఇందుకేనేమో కొందరు ఈ సినిమా భారత దేశాన్ని కొంత హీనంగా చూపించిందని అభిప్రాయపడ్డారు. ఈ సినిమా "సంపూర్ణ భారతదేశ దర్శనం" చేయించేది ఏమీ కాదనీ, కథకు తగ్గ సంఘటనలే చూపారనీ, సినిమాని ఒక సినిమాగానే కళగానే చూడాలి తప్ప దానిని వాస్తవంతో confuse కాకూడదనీ అనుకుంటే ఈ realities గోల లేకుండా మీరు సినిమా చూడగలుగుతారు.

సరే! ఈ reality గొడవ వదిలేసి సినిమాలో కళనీ, కథనీ చూద్దాం. కథ చిన్నదే: slums లో పెరిగిన ఓ కుర్రాడి జీవితంలోని కొన్ని హృదయవిదారకమైన సంఘటనలూ, అతని ప్రేమ కథా, ప్రియురాలి కోసం, who wants to be millionarie లో పాల్గొనడం, గెలవడం, ఇదీ కథ, కథని కళాత్మకంగా చూపించడానికి దర్శకుడు కచ్చితంగా ప్రయత్నించాడు. అయితే వాస్తవాన్ని మరీ సూటిగా, కొన్ని సార్లూ కావాలని హేయంగా చూపించినట్టు నాకు అనిపించింది – అమితాబచ్చన్ ని చూడ్డం కోసం చిన్న పిల్లవాడు మల కూపంలోకి దూకడం, tourists కారు పార్క్ చేసిన వెంటనే కారు టైర్లు దొంగలించబడడం, పోలిసు guide ఏ దొంగ వెధవని కొడుతుంటే వాడు foreign tourist తో You wanted to see India right? This is real India అనడం, ఆ tourist,  I will show you real America"  అని జాలితో డాలర్ల నోట్లు తీసి ఇవ్వడం మొదలైనవి. అయితే మీ అభిరుచిని బట్టి ఈ scenes మీకు కళగానూ అనిపించవచ్చు, నచ్చనూ వచ్చు, కదిలించనూ వచ్చు. అందరి స్పందనలూ ఒకేలా ఉండాలని లేదు కదా! ఈ విషయం గురించి కూడా తర్జన భర్జనలూ, విమర్శలూ, ప్రతి-విమర్శలూ అవీ అనవసరం అని నా అభిప్రాయం.

సినిమాలోని ప్రేమ కథ నాయికా-నాయకుల చిన్నప్పటి  నుండీ మొదలవుతుంది. నిజాయితీగా, సహజంగా అనిపిస్తుంది. వాళ్ళు కొంత పెద్దైన తరువాత జరిగే ప్రేమ కథ (సినిమా last 45 min ఇదే ఉంటుంది) చూస్తే bollywood masala కథలా అనిపించింది నాకు. అప్పటి దాకా ఉన్న feel పోయిందనిపించింది. పైగా సినిమా రివ్యూలు కొన్నింటిలో రాసినట్టు "కష్టాల నుంచి కోటీశ్వరుడిగా" మారిన inspirational and positive attitude story అని కూడా ఏమీ అనిపించలేదు నాకు. మీకు వేరేలా అనిపించొచ్చు గాక.

ఇక చివరిగా music గురించి. రెహ్మాన్ కి గొప్ప అభిమానిని అయిన నాకు ఈ సినిమా సంగీతం బాగుందనే అనిపించింది. అయితే definitely not the best of Rahman so far అని విమర్శకులూ ఒప్పుకుంటారు అనుకుంటాను. ఆస్కార్ కి నామినేట్ అయిన "జై హో" పాట అతి చక్కటి పాటే అయినా, గొప్ప పాట కాదని నా అభిప్రాయం, అయినా ఇన్నాళ్ళకు రెహ్మాన్ కి గొప్ప గుర్తింపు ఈ సినిమా వల్ల రావడం అందరికీ ఆనందమే కదా. నిన్న రెహ్మాన్ అన్నారుట – " ఈ సినిమాని విమర్శించకండి. నచ్చకపోతే మీకు నచ్చినట్టు సినిమా తీసి చూపించండి" అని. ఆయన చెప్పినదాంట్లోని విషయాన్ని అభినందిస్తూనే, ఆయనకి ఇలా చెప్పాలనుంది – "రెహ్మాన్ జీ! మరి సినిమా తియ్యలేని సామాన్య ప్రేక్షకులకి అభిప్రాయాలూ ఉండకూడదా? ఉంటే మరి బయటకి చెప్పకూడదా? ఆ చెప్పినదే విమర్శ అనుకుంటే ఎలా? వాడి అభిప్రాయం అది అనుకుని వదిలెయ్యొచ్చు కదా! ఎందుకంటే నిజమైన విమర్శ చెయ్యగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నాబోటి మిగాతావాళ్ళంతా ఇలా బ్లాగుల్లోనో వాగుడ్లోనో తోచినవి పంచుకుంటారు!"