తిరుమల – వేంకటేశుడు – సర్వసంభవాం
by K.S.M.Phanindra
ఒకసారి తిరుమలలో దర్శనానికి గంటల తరబడి క్యూలో నిలబడి, ఆ ఉక్కపోతా, తోసుకుంటున్న జనం మధ్య ఏ ప్రశాంతతా లేని ఓ అరక్షణం దర్శనం పొందాక అనిపించింది – “అసలు తిరుమలకి వచ్చి దర్శనం చేసుకోవడం అవసరమా?” అని. ఇక్కడి మూలవిరాట్టుకి గొప్ప మహిమలే ఉండి ఉండవచ్చు కానీ మన ఇంటి దగ్గరి వేంకటేశుడి గుడికి వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకుని, గుడిలో కొద్ది సేపు కూర్చుంటే ఎక్కువ ఆధ్యాత్మిక అనుభవం కలుగుతుందని నా అభిప్రాయం. నిజానికి ఈ తిరుమల దర్శనం తర్వాత నాకు ఎంత చికాకేసిందంటే అసలు ఇంకెప్పుడూ తిరుమల దర్శనానికే రాకూడదు అనుకున్నాను. అప్పటికీ నా శ్రీమతి అంటూనే ఉంది – “అలా అనకండి! వేంకటేశుడికి కోపం వస్తుంది, శపిస్తాడు” అని. మనుషులకి ఉండే లక్షణాలైన క్రోధం, ద్వేషం వగైరా దేవుడికి కూడా అంటగట్టడం మన అజ్ఞానం అని నా అభిప్రాయం. కాబట్టి నేను నా శ్రీమతి మాటలని పెద్ద పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ కొంత కాలానికి తిరుమల దర్శనానికి వెళ్ళడం, ఈ సారి దర్శనం సాఫీగా జరగడం కూడా అయ్యింది. అది వేరే సంగతి.
అసలు విషయం ఏమిటంటే TTD కార్యనిర్వహణాధికారిగా నాలుగేళ్ళు పనిచేసిన పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు “సర్వసంభవాం” అన్న శీర్షికన తన మహిమ నిండిన అనుభవాలు కొన్ని 2003 సంవత్సరం స్వాతి వారపత్రికలో పంచుకున్నారు. అప్పట్లో కొన్ని వ్యాసాలు నేను చదివాను. తర్వాత ఈ అనుభవాలు “నాహం కర్తా, హరిః కర్తా” పేరుతో పుస్తకంగా ఎమెస్కో వారు ప్రచురించారు. ఈ పుస్తకం నేను ఈ వారంలో చదవడం జరిగింది. ఆ అనుభవం పంచుకోవాలనే ఈ వ్యాసం.
తన అనుభవాలని చాలా ఆసక్తికరంగా ప్రసాద్ గారు వివరించారు. ఎన్నో సార్లు కళ్ళు చెమ్మగిల్లడం, మనసు ఒక రకమైన భక్తిభావంతో నిండిపోవడం జరిగింది. మొత్తంగా ఒక మంచి ఆధ్యాత్మిక అనుభవాన్ని ఈ పుస్తకం మిగిల్చింది. అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా ఉండడం తప్ప ప్రజలకి పెద్ద ఏమీ చెయ్యరు అనుకున్న నాకు ప్రసాద్ గారు భక్తులకు చేసిన సేవలు అబ్బురపరిచాయి. మాస్టర్ ప్లాన్ ద్వారా గుడి పరిసరాలని ఖాళీ చేయించి, వీధులని వెడల్పు చెయ్యడం ఎంత ప్రయాసతో కూడుకున్నదో ఆయన చెప్తే గానీ తెలియలేదు. అలాగే కాలిబాటపై శాశ్వత గొడుగు (షెల్టర్) ఏర్పరచడం, దారిలో హనుమ, గరుడ విగ్రహాలు ప్రతిష్టించడం కూడా గొప్ప ఆలోచనే. ఇంకా కళ్యానోత్సవాల సంఖ్య పెంచడం, VIP కి ప్రత్యేక వేళలు ఏర్పాటు చేసి ధర్మదర్శనం వేళలు పెంచడం ఇలా ఎన్నో చేశారు. ఇవన్నీ చెయ్యడంలో ఆయన చూపించిన చొరవ, ఎదురుకొన్న ప్రతిఘటనలూ, విధిలో ఉండే రాజకీయ జోక్యాలు, వాటిని చాకచక్యంతో, ధైర్యంతో ఎదురుకొన్న విధానం – ఇవన్నీ ఎవరికైనా సరే management lessons గా పనికి వస్తాయి. వీటితో పాటూ మనకి కొన్ని ఆధ్యాత్మిక విషయాలు, తిరుమలలోని సేవలు ఇలా చాలా సంగతులు తెలుస్తాయి. చివరిగా మహిమల గురించి – కొన్ని అబ్బురపరిచే సంఘటనలు జరిగితే అవి స్వామి మహిమ వల్లా లేక కాకతాళీయమా? దీనికి ప్రసాద్ గారే జవాబిచ్చారు – “నేను అనుకున్నవి ఎన్నో జరగలేదు, కొన్ని ఇక జరగవు అనుకున్నవి జరిగాయి. దేనికైనా యోగ్యతా, ప్రయత్నం, భగవదనుగ్రహం ఉండాలి. స్వామి చెయ్యాలనుకుంటే, మనకి కర్మఫలం, మనలో ప్రయత్నం ఉంటే మనచేత చేయిస్తాడు. అంతే కానీ చేసేది మనం కాదు. నాహం కర్తా, హరిః కర్తా”. ఈ దృక్పథంతో మనం ఉండగలితే జీవితం పరిపూర్ణంగా మార్పుచెందుతుంది. రామకృష్ణ పరమహంస మొదలైన వారు బోధించిన భక్తి మార్గం ఇదే అనుకుంటాను.
నాకు “జ్ఞానమార్గం” ఎక్కువ సరిపడుతుందని నేను అనుకుంటూ ఉంటాను. విషయాలు తెలుసుకోవడంపై నాకు ఎక్కువ ఆసక్తి – కొంత వేదాంతం, ఉపనిషత్తులూ, యోగశాస్త్రం అవీ చదివాను (కానీ అర్థం చేసుకున్నదీ, ఆచరించినదీ చాలా చాలా తక్కువ). పూజలూ, కర్మలపై నాకు ఆసక్తి లేదు. అయితే భక్తి నన్ను కదిలిస్తూ ఉంటుంది. ఓ “వేణువై వచ్చాను భువనానికి” పాట విన్నా, సర్వసంభవాం లాంటి పుస్తకాలు చదివినా, భగవంతుని సేవకి జీవితాన్ని పణం చేసిన వారిని చూసినా నాలో భక్తి భావం నిండిపోతుంది. భక్తిలో ప్రాథమిక విషయం – నిన్ను నీవు మర్చిపోవడం. ఇది జ్ఞానమార్గంలో కంటే భక్తిలో చాలా సులభం. జ్ఞానంలో నాకు చాలా తెలుసన్న కొంత అహంభావం ఉంటుంది. అందుకే కలియుగానికి భక్తిమార్గమే మంచిదని కొందరు గురువులు అన్నారు. అయితే అన్ని మార్గాలూ అవసరమే. నేను భక్తుడిని అంటే నాకు ఇంక జ్ఞానంతో పనిలేదని కాదు. ఏ మార్గమైనా అందులోని అంతరార్థాన్ని అర్థం చేసుకుని తదనుగుణంగా సాగడం ముఖ్యం. అన్ని మార్గాలూ భగవంతుని చెంతకి చేర్చేవే అన్నది సనాతన ధర్మం ప్రపంచానికి చాటిన గొప్ప సందేశం.
మొదట ప్రస్తావించిన తిరుమల దర్శనానికి మళ్ళీ వస్తాను. ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు ఉన్నపాటుగా ఇంకో దర్శనం (perspective) కలిగింది. నువ్వు వెళ్ళినది VIP పాస్‌తో, క్యూలో నిలబడ్డది మహా అయితే 3-4 గంటలు, ఆపాటికే ఏదో గొప్ప అసౌకర్యం కలిగినట్టూ, ఇంత ప్రయాసతో దర్శనం అవసరమా అనేశావు. మరి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, ఎంతెంత దూరాలనుంచో వచ్చి, 12-13 గంటలు ధర్మదర్శనం క్యూలలో ఉన్నవాళ్ళ సంగతి ఏమిటి? నీకే ఇబ్బంది కలగకుండా, హాయిగా దర్శనం అయిపోయి, తిరుమలకి విహారయాత్రలా రావాలనా నీ ఉద్దేశ్యం? అసలు దర్శనం పరమార్థమే నిన్ను నీవు మర్చిపోవడం అయినప్పుడు మళ్ళీ అందులో నీ సుఖం కోరుకోవడమేమిటి? ఎంత అహంభావం, అజ్ఞానం? అవును, నిజం. జ్ఞాని అనుకున్నవాడు అందరికన్నా పెద్ద అజ్ఞాని. ఏమి తెలియదనుకున్నవాడే అసలైన జ్ఞాని. ఈ విషయాన్ని నాకు గుర్తు చేసిన ఆ వేంకటేశుడికి భక్తిపూర్వకంగా ప్రణమిల్లుతున్నాను.
కష్టాల గురించి ఆలోచించకుండా ఇష్టాపూర్వకంగా ఆనందంగా,భక్తితో చేసుకున్న దర్శనం చాలా మధురానుభూతులనిస్తుంది,స్వామివారు కూడా చాలా అందంగా కనిపిస్తారు.గత వారంలో నాకు స్వామివారి దర్శనం అలాంటి అనుభూతినిచ్చింది.
కష్టపడకుండా వచ్చేది ఏదీ ఆనందం ఇవ్వలేదు. భగవంతుని దర్శనంతో సహా. కష్టపడకుండా భగవంతుడు కనపడతాడా ?
ahamkaaram – daanni gelichaamani aanamdinchina kshaname odimchedi
(sorry had to write in english – samayaaniki lekhini lekundaa poyindi)