జలంధర కథలు – ఓ అద్భుతమైన బ్రతుకు పుస్తకం

by K.S.M.Phanindra

ఇప్పటి వరకూ నేను ఎన్నో కథల పుస్తకాలు చదివాను. అయితే ఈ కథల సంపుటిలా నన్నేదీ కదిలించలేదు, ఆలోచింపజేయలేదు. అసలు జలంధర ఎవరో కూడా చాలా మందికి తెలియదు. ఈవిడ పేరు పొందిన గొప్ప కథా రచయిత్రి ఏమీ కాదు. అయితేనేం, ఈవిడ నా మటుకు గొప్ప రచయిత్రే.

జలంధర సినీనటుడు చంద్రమోహన్ భార్యని నాకు తెలుసు. మంచి సాహితీ అభినివేశం ఉన్న మా నాన్నమ్మగారికి జలంధర గారు తెలుసు. కాబట్టి జలంధర గారు తన కథల పుస్తకం మా నాన్నమ్మగారికి ఇవ్వడం, ఆ పుస్తకం మొన్న పాలకొల్లు మా నాన్నమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు నా కంటపడడం జరిగాయి. అలా ఓ గొప్ప పుస్తకం చదివే భాగ్యం కలిగింది.

ఏవో coffee table కథలు అయ్యుంటాయిలే అనుకుని చదవడం మొదలెట్టిన నాకు ఈ కథల్లో బ్రతుకు గురించి గొప్ప తాత్త్వికమైన పరిశీలనా, విశ్లేషణా కనిపించాయి. అంతే, పడుకుని చదువుతున్న వాణ్ణి కాస్తా లేచి కూర్చున్నాను. ఎన్ని సార్లు కళ్ళు చెమర్చాయో, ఎన్ని సార్లు ఈ పుస్తకం మూసేసి ఆలోచనల్లోకి జారిపోయానో లెక్కలేదు. ఎన్నో సార్లు ఈ పుస్తకం వదిలి పారిపోవాలనిపించింది - ఎందుకంటే అద్దంలో మనని మనం నిజంగా చూసుకోడానికి దమ్మూ ధైర్యం ఉండాలి. మనలోని అహంకారాలనీ, విశ్వాసాలనీ, అవినీతినీ, స్వార్థాలనీ మనమే ఒప్పుకోవడం అంత ఈజీ ఏమీ కాదు, అందుకే వీటి గురించి అట్టే ఆలోచించకుండా ఒక రకమైన escapism లో బ్రతుకుతూ ఉంటాం. ఈ పుస్తకం నేను ఏర్పరుచుకున్న status లూ, false prestige లూ, వేసుకున్న ముసుగులూ ఇవన్నీ ఎండగడుతూ ఉంటే నేను మర్చిపోయిన అసలైన నేనేదో అస్పష్టంగా కనిపించింది. Of course , ఇలాంటి foolish thoughts చెయ్యడమేంటని ఈ పుస్తకం చదివిన వెంటనే ఈ ఆలోచనలని కప్పెట్టేశాననుకోండి! (చూశారా, జలంధర గారు! మీ కథలు entertainment కి మాత్రమే పనికొచ్చి, ఇంక నన్నేమీ చెయ్యకుండా ఎలా జాగ్రత్తపడ్డానో. చంద్రమోహన్ గారు మీ కథలు చదివి, అర్థం కాలేదన్నారని ముందుమాటలో రాశారు. అది అర్థం కాకపోవడం కాదు, ఎక్కడ అర్థమైపోతుందో అని భయపడడం. అందుకే మీ కథలని సాధ్యమైనంత దూరంగా ఉంచుతాం)

జలంధర గారిపై జిడ్డు కృష్ణమూర్తి ప్రభావం కొంత ఉన్నట్టు తోచింది. అయితేనేం చెప్పిన విషయాన్ని స్పష్టంగా సరళంగా చెప్పగలిగారు. కథాంశాల్లో కూడా నవ్యత ఉంది. సంఘంపైన బాధ్యతా, అవగాహనా కనిపిస్తాయి. యండమూరి కథలు కొన్ని ఎమెస్కోవారు ప్రచురించారు. వాటిలోనూ కొన్ని ఫిలాసఫీ, సైకాలజీ కలిపిన కథలు ఉన్నాయి. అయితే ఈ జలంధర కథా సంపుటిలో అన్నీ ఫిలసాఫికల్ కథలే. అంటే కూర్చోపెట్టి జీవితం, పరమార్థం అంటూ ఉపన్యాసాలు కూడా ఏమీ ఉండవు. చాలా మాములు జీవితసంఘటనలు తీసుకుని కథలు అల్లి, కథనం ఎంతో ఆసక్తికరంగా నడిపిస్తూ అంతర్లీనంగా ఫిలాసఫీ చొప్పించడం జలంధర గారి లక్షణం. కాబట్టి ఈ కథలు ఎవరైనా చదవొచ్చు, ఎంతో కొంత వినోదం పొందొచ్చు. కావాలంటే కొంత ఆలొచించొచ్చు, ఇంకా ధైర్యం ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు.

కొన్ని కథలని ఉదహరిద్దామనుకున్నాను కానీ, ఏ కథకి ఆ కథే గొప్పగా ఉంది. అందుకే మచ్చుకి కొన్ని వాక్యాలు ఉదహరిస్తాను -

  1. జీవితానికి కావలసింది మనస్సే, టీచర్! కానీ అదొక్కటే చాలదు. ఆడపిల్లకు అసలు సరిపోదు - కానుక కథ
  2. ఇంత చక్కటి తీయని అనుభూతులు మళ్ళీ ఉండవు. మనిషి ప్రవర్తన పరిస్థితులకు ఎప్పుడూ కట్టుపడాలి. అందుకే అశాశ్వతమైన ప్రపంచంలో ప్రతిక్షణం శాశ్వతం కావాలనుకోవడం పిచ్చితనం. ఈ క్షణంలోని భావాలు, రేపు మళ్ళీ మనకుండవు. అలాంటప్పుడు అవి కోరికలతో మలినమై గాయాల్లా జ్ఞాపకానికి రాకూడదు - అగ్నిపుష్పం కథ
  3. కేవలం నువ్వు ఎలా ఉంటావో అన్నదే ముఖ్యమైనప్పుడు, అద్దంలో చూసుకుంటూ నిన్ను నువ్వు పోగొట్టుకుంటావు. ఈ జన్మలో నీకు నువ్వు దొరకవు - తేజస్విని కథ
  4. ఔన్నత్యం అనేది ఒక విక్రమార్క సింహాసనం. పలికితే తప్ప పలకని సాలభంజికలు ఎన్నో. కదిలిస్తే కథలు చెబుతాయి. అధికారమే ఔన్నత్యమనుకుని పాపపు పాదాలతో ఈ అధికారసోపానాలు ఎక్కితే, అవి కన్నీరు కారుస్తాయే కానీ కథలు చెప్పవు - సాలభంజిక కథ
  5. చాలా మంది ప్రేమిస్తున్నాం అనుకునేవాళ్ళు అసలు ఎందుకు ప్రేమిస్తున్నామో, ఏ గుణం ఎదుట మనిషిని గొప్ప మనిషిగా, విలక్షణమైన వ్యక్తిగా రూపుదిద్దుతోందో చెప్పలేరు - పిచ్చితల్లి కథ
  6. కానీ ఏదో ఒక తృప్తి. అది ఆత్మకు సంబంధించింది. నేను జీవితానికి తృప్తి అని నేను అనుకున్న భావనకి దూరమైనా, మానసికమైన ఏదో తెలియని ప్రశాంతత, ఏనాడూ నాకు అర్థం కానిది నా జీవితాన్ని ఆవరించింది - వియద్గంగ కథ