మధులత – 3

by K.S.M.Phanindra

(Read parts 1 & 2 before reading this final part)

Note: ఇదో సరసమైన కథ. నేను 1993 సంవత్సరాన Bangalore లో internship చేస్తున్న రోజుల్లో రాసుకున్నది.ఈ మధ్య పాత రచనలు తిరగేస్తుంటే కనిపించింది. ఇప్పుడు చూస్తే కథ కంటే కథనమే ఎక్కువ ఉందనిపించింది. కొద్ది మార్పులతో ఈ ఏడేళ్ళ క్రితం కథని ఇప్పుడు బ్లాగులో ప్రచురిస్తున్నాను.

>>>>>>>> <<<<<<<<<

“హాయ్, లోపలికి రా” ఇంట్లోకి రాజేష్ ని ఆహ్వానిస్తూ అంది మధులత. హాల్లో కూర్చున్నరు ఇద్దరూ. ఎప్పుడూ మధులత ఇంటికి రాలేదతను. అందుకని ఇళ్ళంతా పరిశీలనగా చూస్తున్నాడు.

ఇంట్లో ఎవరూ లేనట్టున్నారేంటి? అన్నాడు రాజేష్

మా ఫేమిలీ అంతా ఒక పెళ్ళి ఎటెండ్ కావడానికి పక్క ఊరు వెళ్ళారు. రేపొస్తారు. సమాధానం చెప్పి లోపలికి వెళ్ళింది మధులత

రాజేష్ కి ఆశ్చర్యంగా ఉంది. మరి మధులత ఎందుకు వెళ్ళలేదు పెళ్ళికి? ఇంట్లో ఎవరూ ఉండరనే తనను పిలిచిందా? ఒక్కసారిగా రాజేష్ ఆలోచనలు ఎటో పోతున్నాయ్. తాను చూసిన ఎన్నో సినిమాల్లో, చదివిన నవలల్లో ఇలాంటి సన్నివేశాలన్ని గుర్తొస్తున్నాయ్. అతని వయసు నిదురలేస్తోంది. మనసులో ఏదో మూల ఒక చిన్న గొంతు నీ ఆలోచనలు తప్పు అని చెబుతోంది. “తను మధులతని ప్రేమిస్తున్నాడు. ఆమెకిష్టమైతే పెళ్ళిచేసుకుంటాడు. కాబట్టి మధులత గురించి ఇలా ఆలోచించడంలో తప్పులేదు. కేవలం enjoyment కోసం కానీ, ప్రేమ ముసుగులో కానీ అమ్మాయితో సెక్స్ చెయ్యడం తప్పు కానీ, పెళ్ళాడాలనుకున్న అమ్మాయితో అవకాశమొస్తే సెక్స్ చెయ్యడం తప్పు కాదు”. ఈ ఆలోచనతో తప్పంటున్న చిన్ని గొంతును నొక్కేశాడు రాజేష్. ఇప్పుడతనికి ఉత్సాహంగా, ఆతృతగా ఉంది, మధులత ఏం చేస్తుందా అని.

“జ్యూస్ తీస్కో రాజేష్” అందించింది మధులత. జ్యూస్ అందిస్తూ కాస్త ముందుకు వంగినపుడు కనిపించిన వక్షస్థల రేఖ రాజేష్ కంటిలో మెరుపులా మెరిసింది. చిన్న మెరుపే ఇంత అందంగా ఉంటే మరి కురిసే ఉరుముల వాన ఇంకెన్ని అందాలు దాచుకుందో అని ఆలోచిస్తున్నాడు రాజేష్. మధులత అతని పక్కనే కూర్చుంది. చాలా సార్లు వాళ్ళంత దగ్గరగా కూర్చున్నా ఈ రోజెందుకో కొత్తగా ఉంది. ఎప్పుడూ గుర్తించని ఆడవాసనని మొదటిసారి అనుభవిస్తున్నాడు రాజేష్.

ఇంకో పది రోజుల్లో mid sem exams ఉన్నాయ్ కదా. ఏమైనా స్టార్ట్ చేసావా ప్రెపరేషన్?

“లేదు. చదవడానికి మూడ్ రావట్లేదు” అన్నాడు రాజేష్. అప్రయత్నంగానే అన్నా తన సమాధానంలో కొంత రెండో అర్థం ఉండడం గమనించాడతను. మధులత ఏదో చెబుతోంది. ఊకొడ్తున్నాడు కానీ నిజానికి రాజేష్ ఆమె చెప్పేది వినట్లేదు. అతని దృష్టి అంతా ఆమె పెదాలపై ఉంది. అబ్బా, ఎంత అందంగా ఉన్నాయ్. పెదాలు కదులుతుంటే అతన్ని రమ్మని పిలుస్తున్నట్లుగా అనిపిస్తోంది రాజేష్కి. వెంటనే పెదాలను అందుకుని గట్టిగా ముద్దుపెట్టుకోమంటొంది వయసు. “చెంప చెళ్ళుమనిపిస్తుందా, లేక cooperate చేస్తుందా? ఏదో భయం లోపల.

మనిషి బయటకి ఎలా కనిపిస్తున్నా అతని body language ని, కళ్ళని బట్టి ఏమాలోచిస్తున్నాడో చెప్పెయ్యొచ్చు. మధులత తెలివైంది కాబట్టి ఆమె రాజేష్ స్థితిని ఇట్టే అర్థం చేస్కుంది. తన ఇంట్లో ఎవరూ లేరన్న విషయం రాజేష్ మనసులో ఎలాంటి ఆలోచనలు పుట్టిస్తోందో ఆమె గ్రహించింది.

హలో సార్! ఏమిటీ ఆలోచిస్తున్నారు? రాజేష్ కళ్ళకెదురుగా చెయ్యి ఊపుతూ అంది మధులత.

అబ్బే! నువ్వు చెప్పేది వింటున్నాను – కాస్త కంగారు పడుతూ చెప్పాడు రాజేష్

సరే! నేను నిన్ను ఎందుకు పిలిచానో తెలుసా

“ఎందుకు?”

ఏమి చెప్తుందో అని ఆతృతగా ఉంది రాజేష్‌కి. అదేదో సినిమాలో హీరోయిన్ హీరోని ఇదే ప్రశ్న వేసి సమాధానంగా గట్టిగా వాటేసుకుని ముద్దుల్లో ముంచేస్తుంది. అప్పుడు ఓ మంచి రసవత్తరమైన పాట కూడా ఉంది సినిమాలో! ఆ సీన్ గుర్తొచ్చి రాజేష్ “మధులత అలా చేస్తుందా ఏమిటి” అని చూస్తున్నాడు. అతని వయసు అలా చేస్తే ఎంత బాగుండునో అని ఎదురుచూస్తోంది.

గొంతు సవరించుకుని చెప్పసాగింది మధులత -

నేను నిన్ను పెళ్ళిచేసుకోవాలనుకుంటున్నాను, నీకిష్టమైతే. నేను నీ అందాన్ని చూసో, నువ్వు క్లాస్ టాపర్వనో ఈ నిర్ణయం తీసుకోలేదు. నీ పద్ధతులు, నువ్వు జీవితాన్ని గడిపే విధానం నాకు నచ్చాయ్. ఓ ఇద్దరు పెళ్ళి చేసుకోవాలంటే ముందుగా కావలసింది మనసులు కలవడం. అందం, హోదా, కులం, మతం, మొదలైనవన్నీ తర్వాత విషయాలు నా దృష్టిలో. ఎందుకంటే పెళ్ళి జీవితానికి సంబంధించినది. కనుమూసే దాకా పెళ్ళిచేసుకున్న వ్యక్తితోనే గడపాలి. మనసులు కలిసి, ప్రేమలు పంచుకుంటే ఈ బంధం పరిమళిస్తుంది. అందం బాహ్యమైనది. ఏదో నాడు ముసలితనం రాక తప్పదు. మన వ్యక్తిత్వం మటుకు కాలదోషం పట్టకుండా నిలిచి ఉంటుంది. కాబట్టి పెళ్ళికి ముందే ఒకళ్ళ అభిప్రాయం ఒకళ్ళు తెలుసుకోడం చాలా అవసరం. ముఖ్యమైన విషయాల్లో అబిప్రాయ భేదాలు ఉంటే పెళ్ళికి ముందే తెలుసుకోడం ముఖ్యం. ఒక వస్తువు కొనడానికి పదిచోట్ల వాకబుచేసి, చాలా షాపులు తిరిగి తమకి నచ్చిన model & colour తీస్కుంటారు. కానీ ఒక అమ్మాయి లేదా అబ్బాయి పెళ్ళికి ఆస్తిపాస్తులు, కుటుంబగౌరవాలు, ఉద్యోగాలు చూసి పెళ్ళిచేసేస్తారు. ఇందులో పెళ్ళి చేస్కునే వాళ్ళ ఆలోచనలకి, అభిప్రాయాలకి ప్రాముఖ్యత లేదు. కొన్న వస్తువులకి గ్యారంటీ ఉంటుంది. నా దృష్టిలో పెళ్ళికి గ్యారంటీ ఆస్తో, కుటుంబమో, ఉద్యోగమో కాదు, అది కలిసిన మనసులు. పెళ్ళైన తర్వాత మనసులు కలవొచ్చు. కానీ కలవకపోతే? అందుకే పెళ్ళికి ముందే అబ్బాయిలూ, అమ్మాయిలూ తమ ఆలోచనలు, అభిప్రాయాలు చర్చించుకోవాలి.

ఒకవేళ నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటే, రేపటి నుంచి నీ బైక్ వెనకాల కూర్చుని, నీ నడుముపై చెయ్యి వేసి పార్కులకి సినిమాలకి వస్తాననుకోకు. పెళ్ళాయాకే నీకా అదృష్టం దక్కేది. మనం ప్రేమించుకుంటున్నాం కానీ ప్రేమంటే ఒక అందమైన ఫీలింగ్ మాత్రమే కాదు. కలలు కనడం మాత్రమే కాదు. ఇవన్నీ ప్రేమలో భాగమై ఉండొచ్చు కానీ ఇవే ప్రేమ కాలేవు. ప్రేమంటే నేను నన్ను మర్చిపోయి, నీకోసం ఏదైన చెయ్యడంలో ఆనందం పొందడం. ప్రేమలో మాటలు కాదు, చేతలు కావాలి. కలలు కాదు, నిజాలు కావాలి.

పోతే ఈ కాలంలో పెళ్ళికి ముందే శారీరిక కలయిక సాధారణమైపోతోంది. ఇందులో కొందరు ఎలాగా పెళ్ళి చేసుకుంటాం కదా అని, ఇంకొందరు జస్ట్ ఎంజాయ్మెంట్ కోసమనీ ఇలా చేస్తుంటారు. మనం ఎవరికీ హాని కలిగించకుండా సుఖపడడం తప్పేమిటి అని వీరి వాదన. నిజమే, వ్యక్తిగతంగా చూసుకుంటే తప్పులేదు. కానీ మనం ఒక సమాజంలో నివసిస్తున్నామని మర్చిపోకూడదు. ఆ సమాజాన్ని నిర్వచించేది, నడిపించేది కూడా మనమే. సమాజం పటిష్టంగా ఉండాలంటే అందులో కుటుంబాలు పటిష్టంగా ఉండాలి. కుటుంబాలు పటిష్టంగా ఉండాలంటే చక్కని అనుబంధం ఉండాలి భార్యా భర్తల మధ్య. ఎప్పుడైతే పెళ్ళి సెక్స్కి లైసెన్స్గా మారిపోతుందో అప్పుడు కామమే తప్ప అనుబంధం ఉండదు. అప్పుడు కుటుంబం, సమాజం కూడా దెబ్బతింటాయి. సుఖపడితే తప్పులేదనుకునేవారు పెళ్ళి తర్వాత కూడా అలాగే ఆలోచిస్తారు. అందుకే అలాంటివాళ్ళ పెళ్ళిళ్ళు విడాకుల ద్వారా ముగుస్తాయ్. వయసు ఎన్నో కోర్కెలు, అలజడులూ రేపుతుంది. అది చాలా సహజం. ఎన్నో శృంగార కలలు కంటాం. అయితే కొన్ని కలలు కలగానే ఉండడం మంచిది. పెళ్ళయ్యాక ఆ కలలన్నీ పండించుకోడమే సరైన పద్ధతని నా నమ్మకం. నా అభిప్రాయాలు విన్నావు కదా. మరి నీ అభిప్రాయమేమిటి? ఇప్పుడూ నేను నీకు నచ్చానా?

రాజేష్ అలాగే మధులతని చూస్తున్నాడు. అతనికి మాట రావట్లేదు. అతనిలో వికారాలన్ని కరిగిపోయాయి. మధులత అంతస్సౌందర్యాన్ని ఈ రోజు పూర్తిగా చూశాడతను. ఇప్పుడూ మధులత అతనికి ఎప్పుడూ లేనంత అందంగా కనిపిస్తోంది.
>>>>>>>> <<<<<<<<<

అది శోభనం గది. సర్వాంగసుందరంగా అలంకరించారు. తనెంత అందంగా ఉన్నానో చూసుకుని ఆ గది గర్వంతో పొంగిపోయింది. ఇంతలోగా మధులత పాలగ్లాసుతో అడుగుపెట్టీంది మనోహరంగా. ఆమె అందాన్ని చూశాక ఆ గది అందం పటాపంచలైపోయింది. ఇది గమనించి చిన్నగా నవ్వుకుంది మధులత. నెమ్మదిగా తలెత్తి చూసింది. ఎదురుగా మంచం మీద రాజేష్ ఆమెనే చూస్తున్నాడు. ఆ చూపుల్లో కాంక్ష లేదు, ప్రేమ ఉంది. తనంత అదృష్టవంతుడు భూమ్మీద ఎవరూ లేరనే గర్వం ఉంది. పాలగ్లాసు అందిస్తూ కళ్ళతో ఓ కొంటె సైగ చేసింది మధులత. అలా తన నేత్రవిద్య మొదటిసారి అతనిముందు ప్రదర్శించింది. రాజేష్ ఆమెను దగ్గరకి తీసుకుని నుదుటిపైన సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. ఈ ముద్దు నీకు బొట్టు. ఆమె ముక్కుని తన ముక్కుతో సుతారంగా నిమిరి ఓ చిన్న ముద్దిచ్చి అన్నాడు “ఇది నీకు ముక్కుపుడక”. తర్వాత పెదాలని ముద్దాడుతూ అన్నాడు – ఇది నీ గులాబీ పూల పెదాలపై నీటిముత్యం. అతను ఇంకా ఏం చేస్తాడోనని తలచుకుని అందంగా సిగ్గుపడింది మధులత.

ఆకాశంలో చందమామకి వీళ్ళిద్దరి వలపు గుసగుసలు వినాలని తెగ ఉబలాటంగా ఉంది. వెన్నెలని అడిగాడు చెప్పమని. వెన్నెల చిరుగాలిని అడిగింది. చిరుగాలి అంది – “నాకేం తెలుసు! నన్ను వాళ్ళ మధ్య దూరనిస్తే కదా!” పాపం చందమామకి నిరాశ మిగిలింది. కానీ వాళ్ళ గుసగుసలు, చిలిపిపనులూ నలిగిపోతున్న మల్లెపూలకి తెలుసు, ఆగిపోయిన కాలానికి తెలుసు, వాళ్ళిద్దరినీ దీవిస్తున్న మంచానికి తెలుసు.

హాయిభారాలు అంటే ఏమిటో ఇప్పుడు మధులత అనుభూతి చెందుతోంది!