మధులత – 2

by K.S.M.Phanindra

(Read part 1 before reading this)

Note: ఇదో సరసమైన కథ. నేను 1993 సంవత్సరాన Bangalore లో internship చేస్తున్న రోజుల్లో రాసుకున్నది.ఈ మధ్య పాత రచనలు తిరగేస్తుంటే కనిపించింది. ఇప్పుడు చూస్తే కథ కంటే కథనమే ఎక్కువ ఉందనిపించింది. కొద్ది మార్పులతో ఈ ఏడేళ్ళ క్రితం కథని ఇప్పుడు బ్లాగులో ప్రచురిస్తున్నాను.

>>>>>>>> <<<<<<<<<

మధులత చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణం. క్లాసులు మొదలయ్యే టై ము కావడంతో వచ్చేవాళ్ళతో సందడిగా ఉంది. అక్కడ నిల్చుని గమనిస్తే రకరకాల స్టూడెంట్స్ ని చూడొచ్చు. కొందరు అబ్బాయిలు పుస్తకాలు చదువుకుంటూ ఏ వంకా చూడకుండా తిన్నగా క్లాసులకి వెళ్ళిపోతుంటారు. వీళ్ళకి సాధారణంగా కళ్ళజోళ్ళు ఉంటాయ్. వీళ్ళు చదువుకే అంకితమైన విద్యార్థులన్నమాట. వీళ్ళకి ఏ “పిల్లగాలీ” పట్టదు. అలాగే “కుర్రగాలి” పట్టని ఈ రకం అమ్మాయిలూ ఉంటారు. అయితే ఇలాంటి విద్యార్థులు అంతరించిపోతున్న జాతుల లిస్ట్ లోని వారు. చాలా అరుదుగా ఇలాంటి వాళ్ళని చూస్తాం. నాణానికి మరో వైపున కాలేజీకి అమ్మాయిలని చూడటానికే వచ్చేవాళ్ళూ ఉంటారు. వాళ్ళకి చదువు సెకెండ్ ప్రెయారిటీ. ఇలాంటి అబ్బాయిలకోసమే వచ్చే అమ్మాయిలూ ఉంటారు. ఈ రెండు extreme cases వదిలేస్తే చాల మంది మధ్యరకం జాతిలోకి వస్తారు. వాళ్ళకి చదువూ కావాలి వినోదమూ కావాలి.

కాలేజీ అమ్మాయిల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే కాలేజీకి కళా కాంతీ వారే కనుక. మోడ్రన్ డ్రస్సులతో వింతగా కవ్వింతగా కనిపించే అమ్మాయిలు కొందరైతే సాంప్రదాయమైన వస్త్రధారణలో కనిపించే అమ్మాయిలు ఇంకొందరు. ఈ రెండో రకం అమ్మాయిలలో కొందరికి జీన్స్ లాంటి మోడ్రన్ డ్రస్సులు వేసుకోవాలనే ఉంటుంది. కానీ సిగ్గూ భయం వాళ్ళని ఆపుతాయ్. వాళ్ళు కనుక లేడీస్ హాస్టల్ లో ఉంటే హాస్టల్‌లో మటుకు మోడ్రన్ డ్రస్సులలో దర్శనమిస్తారు. అందుకే కుర్రాళ్ళకి లేడీస్ హాస్టల్ లోకి వెళ్ళాలని ఉంటుంది!

ఇప్పుడు మెట్రోస్ లో కాలేజీ అమ్మాయిల, అబ్బాయిల మధ్య చనువు బాగా పెరిగింది. స్వచ్చమైన స్నేహాలు నిజమైన ప్రేమలూ ఉన్నాయి. కానీ స్నేహమూ, ప్రేమా కాని ఇంకో రకం సంబంధం కూడా ఉంది. అది కేవలం enjoyment కోసం చేసేదన్నమాట. శారీరిక సంబంధం కూడా ఈ బంధంలో భాగమే. డేటింగ్ పేరు మీద కొన్నిసార్లు ఇది జరుగుతుంది. కొన్నిసార్లు స్నేహం లేదా ప్రేమ ముసుగులోనూ ఇది జరుగుతుంది. ఈ సంస్కృతి ఇప్పుడు మెట్రోస్ లో సాధారణమైంది. మామూలు పల్లెలకీ, పట్టణాలకీ క్రమంగా పాకుతోంది.

>>>>>>>> <<<<<<<<<

మధులత క్లాసులో కూర్చుంది. ఇంకా క్లాస్ మొదలవ్వలేదు. స్టూడెంట్స్ వస్తున్నారు. క్లాసులోకి వస్తున్న “రాజేష్” ని చూడగానే మధులత మొహం విప్పారింది. హాయ్ అంది వెంటనే. రాజేష్ కూడా చిరునవ్వుతో హాయ్ అన్నాడు. “ఏంటి నిద్రమొహంతో ఉన్నావ్. రాత్రి సరిగా నిద్రపోలేదా బాబూ” అని అడిగింది మధులత. “రాత్రి రూంలో మూవీ చూస్తూ లేట్ అయ్యింది” రాజేష్ చెప్పాడు. “ఏ సినిమా” అని అడగబోయి ఆగిపోయింది మధులత. అబ్బాయిలు చూసే అన్ని సినిమాల గురించి అమ్మాయిలు అడగకూడదు కదా! ఇంతలో లెక్చరర్ రావడంతో క్లాసు మొదలైంది.

రాజేష్ క్లాస్ టాపర్. చూడడానికి చక్కగా కూడా ఉండడంతో అమ్మాయిలందరికీ అతనంటే సహజంగా అభిమానం. కానీ రాజేష్ కి అమ్మాయిలంటే ఇష్టమున్నా సిగ్గు వల్ల ఎక్కువగా కలిసిపోడు. ఒక్క మధులతతోనే అతనికి చనువు ఎక్కువ. మధులతకి కూడా రాజేష్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే రాజేష్ చాలా పట్టుదలగా చదువుతాడు. అయితే చదువే లోకంగా ఉండదు. వినోదానికీ ప్రాధాన్యతనిస్తాడు. ఫ్రెండ్స్ తో అప్పుడప్పుడూ సినిమాలకీ షికార్లకీ వెళుతుంటాడు. అతను వినోదాన్ని, చదువునీ బేలెన్స్ చేస్తూ క్లాస్ టాపర్గా నిలవడం మధులతకి నచ్చిన విషయం. వాళ్ళు చాలా సార్లు విడిగా కబుర్లు చెప్పుకుంటారు. రాజేష్‌కి మనసులో మధులత అంటే ప్రేమ ఉన్నా ఆమె ఏమంటుందోనన్న సందేహంతో బయటకి చెప్పలేదు. కానీ క్లాసులో అందరూ వాళ్ళిద్దరూ లవర్స్ అనే అనుకుంటారు.

>>>>>>>> <<<<<<<<<

అది లేడీస్ హాస్టల్. మధులత ఫ్రెండ్స్ చాలా మంది అక్కడ ఉంటున్నారు. అప్పుడప్పుడు మధులత హాస్టల్‌కి వస్తుంటుంది. ఆ రోజు సాయంత్రం కాలేజీ ముగిశాక అంతా అక్కడ చేరారు.

“ఏయ్ మధులతా! ఏమంటున్నాడే నీ రాజేష్?” అంతా ముసిముసినవ్వులు నవ్వుతూ మధులతకేసి చూస్తున్నారు.
“హా! లవర్స్ మధ్య జరిగేవన్నీ మనకు చెప్తారా ఏంటి?” మళ్ళీ నవ్వులు.
ఈ నవ్వుల మధ్య మధులత గొంతు విప్పింది.
“నేను రాజేష్ ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను” సీరియస్‌గా చెప్పింది.
ఒక్కసారిగా చుట్టూ అందరూ ఆశ్చర్యపోయారు. తరచూ వాళ్ళు మధులతని ఆటపట్టిస్తారు రాజేష్ పేరు చెప్పి. మధులత ఎప్పుడూ నవ్వుతుందే కానీ ఏమీ అనదు. అలాంటిది ఒక్కసారిగా రాజేష్‌ని పెళ్ళి చేసుకుంటాననడం వాళ్ళ ఆశ్చర్యానికి కారణం. ముందుగా తేరుకున్న ఒక అమ్మాయి -
“అబ్బా! ఎంత కాలానికి బైట పడ్డావ్. నువ్వు చెప్పకపోయినా కాలేజీ అందరికీ తెలుసు మీరు లవర్స్ అని” అంది.
“ఈ విషయం ఇంకా రాజేష్ కి చెప్పలేదు. అయినా మేము పెళ్ళిచేసుకుంటాం అంటే రేపటి నుంచి పార్కులకి, షికార్లకీ వెళ్తామని కాదు. ఎప్పటిలాగే ఉంటాం. రాజేష్ పద్ధతులు నాకు నచ్చాయ్. అతనికిష్టమైతే చదువు పూర్తయ్యాక, ఉద్యోగమొచ్చి స్థిరపడ్డాక పెళ్ళిచేసుకుందామని అడుగుతాను” మధులత స్పష్టంగా చెప్పింది.
“చాలా వెరైటీగా ఉందే ఇదేదో. అసలు పెళ్ళికి ముందే అన్నీ కానిచ్చేసి దాన్నే ప్రేమంటుంటే నువ్వేమిటే ఇంకా black & white సినిమాల కాలం దానిలా మాట్లాడతావ్” అందుకుందో అమ్మాయి. ఈమెకు ఓ బోయ్ ఫ్రెండ్ ఉన్నాడు మరి.
“చీ పోవే! నీకస్సలు సిగ్గులేకుండా పోయింది. మధులత నీలాగే ఆలోచిస్తుందనుకున్నావా ఏమిటి?” కసురుతున్నట్ట్లు అందింకో అమ్మాయి.
“నేను చేస్తున్న తప్పేముంది. నచ్చినవాడితో సుఖపడ్డంలో తప్పేమిటి? ఈ రోజుల్లో చాలామంది అబ్బాయిలకి పెళ్ళికి ముందే సెక్స్ అనుభవముంది. సెక్స్ ని ఏదో పాపకార్యంలా భావించడం old stupidness. అదో అవసరం, అంతే. శీలం, పతివ్రత లాంటివన్నీ అర్థంలేని పదాలు. మగాళ్ళు స్త్రీలను డిసీవ్ చెయ్యడానికి invent చేశారు వీటిని. అయినా మనం ఎవరికీ ఏ హార్మ్ చెయ్యకుండా మన సుఖం మనం చూసుకుంటే దాని ఎందుకు question చెయ్యాలి” తనను సమర్థించుకుంటూ అందా అమ్మాయి
“ఉంది. తప్పుంది.” గంభీరంగా అధికార స్వరంతో చెప్పింది మధులత.

ఆమె మధులత. ఏ విషయంపైనైనా తన అభిప్రాయం చెప్పిందంటే సూటిగా సమర్థవంతంగా, కన్విన్సింగ్‌గా చెప్తుంది. ఇప్పుడు అక్కడ అదే జరుగుతోంది.

>>>>>>>> <<<<<<<<<

“ఏంట్రా రాజేష్! మధులత నిన్ను రేపు వాళ్ళింటికి రమ్మందా? ముఖ్యమైన విషయం మాట్లాడాలందా? నీ పంట పండిందిరోయ్
ఆ అమ్మాయికి కూడా నువ్వంటే ఇష్టమనుకుంటా. I love you చెప్తుందేమోరోయ్.
ఆ చెప్పేదేదో కాలేజ్‌లోనే చెప్పొచ్చుగా. ఇంటికెందుకు పిల్చిందీ అన్నది పాయంట్.
ఏకాంతం కావాలేమో
ఏకాంతంలో చేసే పనులేమిట్రా మామా
ఏకంత వేళ…ఏకాంత సేవ…”
రాజేష్ ని టీజ్ చేస్తున్నారు కొందరు చిలిపి మిత్రులు.

“ఊర్కోండిరా మీరు. వాడు సీరియస్గా విషయం చెప్తే మీరేంటిలా? అయినా మధులత గురించి మీకు తెలుసుగా. ఆ వెధవ కామెంట్స్ ఎందుకు – ఆదుకున్నాడో మిత్రుడు.
ఊరికే అన్నాం లేరా. అయినా ఈ రోజుల్లో ఇలాంటివన్నీ కామన్ రా. అసలు మంచివాడంటే తప్పు చెయ్యడానికి అవకాశం లేనివాడన్న మాట
అవున్రా. నువ్వే చెప్పాలి ఇలాంటివి. ముగ్గురు గోపికలున్న కృష్ణుడివి కదా.
ఒరేయ్ రాజేష్. నువ్వు మాత్రం రేపు మధులతతో ప్రేమ విషయం భయపడకుండా చెప్పు. సరేనా.
సరే అన్నాడు రాజేష్

(To be continued)