మధులత – 1
by K.S.M.Phanindra
Note: ఇదో సరసమైన కథ. నేను 1993 సంవత్సరాన Bangalore లో internship చేస్తున్న రోజుల్లో రాసుకున్నది.ఈ మధ్య పాత రచనలు తిరగేస్తుంటే కనిపించింది. ఇప్పుడు చూస్తే కథ కంటే కథనమే ఎక్కువ ఉందనిపించింది. కొద్ది మార్పులతో ఈ ఏడేళ్ళ క్రితం కథని ఇప్పుడు బ్లాగులో ప్రచురిస్తున్నాను.
ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నువ్వురానప్పుడు
ఈ రాయబారాలు సాగే చలిలో
ఆ హాయిభారాలు మోసే జతలో
… టేప్ రికార్డర్ నుంచి వినిపిస్తున్న వేటూరి పాట గదంతా పరుచుకుంటోంది. మంచం మీద బోర్లా పడుకుని ఓ సరసమైన కథ చదువుతున్న ఆ అమ్మాయి “హాయిభారాలు” అన్న కవిప్రయోగానికి చిన్నగా నవ్వుకుంది. పాట ప్రభావమో ఏమో ఒక కమ్మని కల ఆమెని లాక్కెళ్ళిపోయింది.
అది పండు వెన్నెల రాత్రి. ఆకాశంలో చందమామ చిలిపిగా కన్నుకొడుతున్నాడు. పిల్లగాలి అల్లరి పెడుతోంది. తనూ ఎదురుగా తన ప్రియుడు – ఇద్దరే. మిగిలిన లోకమంతా తప్పుకుంది మధ్యలో నేనెందుకంటూ. హఠాత్తుగా ఆ ప్రియుడు ఆమెను గట్టిగా ముద్దుపెట్టేసుకున్నాడు. అస్సలు ఊహించలేదు ఆమె అతనలా చేస్తాడని. “మహా దుడుకు సుమా” అనుకుంది మనసులో సిగ్గులమొగ్గైపోతూ. ఆ సిగ్గులలోని సంకేతాలు తెలిసిన ప్రియుడు దగ్గరగా జరిగి “మొదలే కానీ అంతం తెలియని మన ఆటలో ఇప్పుడేం చేస్తానో చెప్పుకో చూద్దాం” అన్నాడు గుసగుసగా ఆమె చెవిలో. ఆమె చిన్నగా నవ్వి కళ్ళతో చందమామని చూపించింది. అప్పుడు గమనించాడతను చందమామ కన్నార్పకుండా వాళ్ళనే చూస్తున్నాడని. “ఎన్ని సార్లు చెప్పినా బుద్ధి మార్చుకోడీ చందమామ! ఈ సారి ఏమైనా చెయ్యాలి” అని అతను అనుకుంటూ ఉండగానే చందమామ నవ్వుకుంటూ మబ్బుల వెనక్కి వెళ్ళిపోయాడు. విషయం తెలిసిన చుక్కలు కళ్ళు మూసుకున్నాయ్. అతను గర్వంగా ఆమెకేసి చూశాడు..
ఊహలోంచి వాస్తవంలోకి వచ్చిందా అమ్మాయి. తనకు వచ్చిన కలని తలుచుకుని కాస్త సిగ్గుపడింది. వెంటనే స్టడీ టేబుల్ దగ్గరకి వెళ్ళి చదువులో నిమగ్నమైపోయింది. ఇదే ఆమెలోని ప్రత్యేకత. చాలా మందిలాగ ఆమె ఊహల్లోనే తేలిపోతూ ఉండదు. కలలు కలలేనని ఆమెకి తెలుసు.
ఆ అమ్మాయి పేరు మధులత. Bangalore లో ఇంజనీరింగ్ final year చదువుతోంది. తెలుగమ్మాయే. మోడ్రన్ మిలీనియం అమ్మాయిలా ఉంటూనే మన ఘనమైన సంస్కృతీ సాంప్రదాయాలను ఆమె ప్రాణంగా ప్రేమిస్తుంది. జీన్స్ టీషర్ట్ వేసి కుర్రాళ్ళలో కలవరం పుట్టిస్తుంది. అలాగే బాపూ బొమ్మలా ముస్తాబై తెలుగుదనానికి నిర్వచనంలా రమణీయ దృస్యకావ్యంలా కనిపిస్తుంది. ఆమె ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడగలదు. అలాగే ఎన్నో తెలుగు పద్యాలను అవలీలగా వల్లెవేయగలదు. పాప్ మ్యూజిక్ వింటూ హుషారుగా స్టెప్స్ వేస్తూనే మన శాస్త్రీయ సంగీతం వింటూ మైమరిచిపోతుంది. కాళిదాసు కావ్యాల నుంచి Jeffrey Archer నవలల దాకా ఆమెకు అన్నీ అంతో ఇంతో పరిచయం ఉన్నాయ్.
మనసులోని ఉద్రేకాలని రెచ్చగొట్టే అందం కాదామెది. ఉదయాన్నే సూర్యోదయాన్ని చూస్తున్నప్పుడు కలిగే ఆహ్లాదం ఆమెను చూసినప్పుడూ కలుగుతుంది. కాస్త అమాయకత్వం, కాస్త చిలిపితనం, కాస్త చలాకీతనం, కాస్త కొంటెతనం కలగలసిన వ్యక్తిత్వం ఆమెది. ఆమె రూపం కవులు వర్ణించినట్టు జాబిలిలా ఉంటుంది. అమవాస్య అంటని చిరునవ్వుల వెన్నెలను వెదజల్లుతూ ఉంటుంది. ఆమె నల్లని పొడుగాటి జడ మంత్రదండంలా కుర్రాళ్ళని మంత్రించివేస్తుంది. ఎప్పుడైనా తలస్నానం చేసి ఆమె జుట్టును ముడివెయ్యకుండా అలా వదిలేస్తే ఆ కురులకారడవిలో యువకుల మనసులు చిక్కుకుపోవలసిందే. ఆశల మెరుపులు ఆమె కళ్ళలో కనిపిస్తుంటాయ్. ఆ కళ్ళకి మాట్లాడ్డం కూడా వచ్చు. ఓరచూపులతో కంటి సైగలతో ఎన్నో భావాలను పలికించడంలో ఆమె ప్రావీణ్యురాలు. అయితే ఆమె ఈ నేత్రవిద్యను ప్రియుడి ముందే ప్రదర్శించాలని ఎవరికీ తెలియకుండా దాచుకుంది. ఆమె పెదాలు లేత గులాబి మొగ్గల్లా ఉంటాయ్. నవ్వినప్పుడు పువ్వులా విచ్చుకుంటాయ్. మిగిలిన ఒంపుసొంపుల సంగతి సరేసరి. ఇలా ఆమె అందాలన్నీ వేటికవే సాటి. అందంతో ప్రాణమున్నవారిని శిల్పాలుగానూ ఆమె మార్చగలదు, శిల్పాలకి ప్రాణాన్నీ పోయగలదు.
ఆమె అబ్బాయిలతో సహా క్లాసులో అందరితోనూ కలుపుగోలుగా ఉంటుంది. తాను అబ్బాయిలకంటే తక్కువని ఆమె ఏనాడూ అనుకోలేదు. ఆ మాటకొస్తే ఆమె dynamic personality ముందు అబ్బాయిలే దిగదుడుపు. ఏ విషయాన్నైనా ధైర్యంగా ప్రశ్నించడం ఆమెకి అలవాటు. వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. అంతేగాని మనసు పెట్టే ప్రలోభాలకి లొంగదు. జీవితంపై ఖచ్చితమైన అభిప్రాయాలు ఆమెకు ఉన్నాయ్. బ్రతకడానికీ జీవించడానికి మధ్య ఉన్న తేడా ఆమెకి తెలుసు. జీవితం దేవుడు మనకిచ్చిన వరమనీ, నవ్వుతూ ప్రేమ పరిమళాలు పంచుతూ హాయిగా గడపాలని ఆమె సిద్ధాంతం. ఒక్కమాటలో చెప్పాలంటే ఆమె పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగిన అందమైన తెలుగమ్మాయి.
(To be contd)