మిథునం
by K.S.M.Phanindra
నాకు తెలుగు కథలు చదవడం అంటే చాలా ఇష్టం ఉండేది. ఈ మధ్య కొంత తగ్గిందనే చెప్పొచ్చు. అంతకు ముందు ఈనాడు ఆదివారం పుస్తకం కథలని చాలా ఆసక్తిగా చదివే వాడిని, ఇప్పుడైతే చదవ బుద్ధే కావడం లేదు. ఈనాడు కథలు వేస్ట్, తెలుగులో గొప్ప కథలు చాలా ఉన్నాయ్, అవి చదవండి – అని మీరు అనొచ్చు. అలాటివీ నేను చదివాను. కాని చెప్పానుగా, ఈ మధ్య గొప్పవి కూడా నన్ను ఆకర్షించట్లేదు.
ఇలాటి నన్ను "మిథునం" కథల సంపుటి బాగా ఆకట్టుకుంది. రచయిత శ్రీరమణ. ఈయనని ఎప్పుడూ నేను ముళ్ళపూడి వెంకటరమణతో confuse అయ్యే వాడిని. ఈయన రాసిన హాస్యం నిండిన వ్యాసాలూ అవీ చదివాను. మిథునం గురించి మిత్రుడు కిరణ్ చెప్తే కొన్నాను. అది ఒక నవల అనుకున్నాను, కొని తెరిచాక తెలిసింది కథల పుస్తకం అని. ఇందులో 8 కథలు ఉన్నాయ్. అన్నీ 1994-1997 మధ్య రాసినవే, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక, రచన మొదలైన పత్రికల్లో వచ్చాయట.
మిథునం ఆఖరి కథ. ఈ కథ చదివి బాపూ తన స్వదస్తూరీతో కథంతా రాసి శ్రీ రమణని ఆశీర్వదించారని, రచన పత్రికలో బాపూ దస్తూరీతో ఉన్న కథ రెండు సార్లు ప్రచురించారనీ ఉంది. సో high expectations ఏర్పడ్డాయ్ చదవక ముందే. తీరా చదివాకా నిరుత్సాహం కలుగుతుందేమో అన్న అనుమానం వచ్చింది కూడా. కథ ఇద్దరు ముసలి దంపతుల అనుబంధం గురించి. వాళ్ళ పెంకుటిల్లు, చుట్టూ ఉన్న మొక్కల గురించి వర్ణన అద్భుతంగా తోచింది. ఈ హైదరాబాదులూ, బాధలూ, ఫ్లాటులూ వదిలి అక్కడికి పారిపోవాలనిపించింది. వృద్ధ దంపతులు ఇద్దరూ ఒకరినొకరు దెప్పిపొడుచుకోడాలూ, కోప్పడ్డాలూ, తగువు పడడాలూ ఇవన్నీ ఒకింత హాస్యంతో రచయిత రక్తికట్టించారు. అన్యోన్య దాంపత్యం అంటే ఇలా ఉండాలి అని లెక్చరు ఇవ్వకుండా ఆ ముసలి దంపతుల దైనందిక జీవితాన్ని చూపిచి మనకి చెప్తారు. కథ చదివి మనసు ఆర్ద్రతతో నిండిపోయి కళ్ళు చెమర్చాయి. ఎన్నాళ్ళైందో ఇలాటి కథ చదివి. మనం మనుషులం అని తెలుసుకునేందుకు, గుర్తుచేసుకునేందుకు ఇలాటి కథలు చదవాలి. శ్రీరమణ ధన్యుడు.
మిథునం కథ అంత స్పందింపజేసి కంటితడి తెప్పించిన కథ "బంగారు మురుగు". ఒక బామ్మా – మనవడి అనుబంధాన్ని గొప్పగా ఆవిష్కరించిన కథ. "దయ కంటే పుణ్యం లేదు, నిర్దయ కంటే పాపం లేదు" అని బామ్మ చేత పలికించి భక్తి ముసుగులో మానవతని మరిచిపోతున్న మనుషులకి ఒక చురక తగిలిస్తారు రచయిత. భగవద్గీతని బట్టీ పట్టి ఉపన్యాసాలు దంచి అమాయకులని వలలో పడేసి వారి సంపదలతో తాము భోగభాగ్యాలు అనుభవించే స్వాముల పైనా సున్నితమైన విమర్శ ఉందీ కథలో.
"అరటిపువ్వు సాములోరు" కథలో అరటి పువ్వుని ఉదాహరణగా తీసుకుని ప్రజలకి మంచినీ, వేదాంతాన్ని బోధించే స్వామీజి కనిపిస్తాడు. "అరటి పువ్వు" లో తాత్త్వికతని ని రెండు మూడు రకాలుగా వర్ణించడంలో రచయిత imagination కనిపిస్తుంది.
"తేనెలో చీమ" కథ పెద్దోళ్ళు తమ స్వార్థం కోసం పేదోళ్ళని ఎలా వాడుకుంటారో నాటకీయంగా తెలిపే కథ. బక్కగా పుల్లలా ఉన్నోడిని ఊరి ప్రెసిడెంటు తొమ్మిది నెలల్లో వస్తాడులా చేసి 100 మినుముల బస్తాలు ఇట్టే మోయిస్తానని సవాలు చేస్తాడు. తమ పరవూ పంతం కోసం ప్రజలని పావుల్లా వాడే రాజకీయనాయకులు ఈ కథలో దర్శనమిస్తారు.
"వరహాల బావి" కథలో రగిలే అగ్ని పర్వతంలా ఉన్న మన సామాజిక వ్యవస్థ కనిపిస్తుంది. పైపైన కలిసున్నా లోలోపల మనలో పేరుకుపోయిన విభేదాలు ఎన్నో! కులం, మతం, ప్రాంతం ఇలా ఏ పేరు చెప్పైనా ఎవరైనా మనని రెచ్చగొట్టచ్చు. ఈ కథలో చిన్న గొడవ పెరిగి, హిందూ ముస్లిముల మధ్య పెను అగాధం సృష్టించి చివరికి ఊరికి ప్రాణాధారమైన బావినే కబళించే పెను ప్రమాదంగా ఎలా మారుతుందో చూడొచ్చు.
"ధనలక్ష్మి" ఆసక్తికరమైన కథ. కొందరికి చదువులేక పోయినా వ్యాపార లౌక్యం ఉంటుంది. పైకి సాదాసీదాగా కనిపించే ఇల్లాలు అతి పేద స్థితి నుంచీ పిండి మిల్లుతో ప్రారంభించి పెద్ద మేడ ఎలా కట్టిందో తెలిపే కథ ఇది. మొగుడికి లొంగుతున్నట్టే అనిపించి, అతని చేత తమకి కావలిసిన పనినే చేయించుకునే తెలివి తెలియాలంటే అమ్మాయిలు ఈ కథ చదవగలరు!
ఒక సోడా బండి వాడి గురించి చెప్తూ కూడా ఆసక్తికరమైన కథ రాయొచ్చు అని నిరూపించే కథ "షోడా నాయుడు". ఆ రోజుల్లో షోడ బళ్ళతో ముడిపడ్డ గ్రామ వ్యవస్థనీ, పరస్పర ఆప్యాయతలనీ, మంచితనాలని ఈ కథలో చూడొచ్చు. సోడా లో గోళీలు కావాలని రచయిత నాయుడు చుట్టూ తిరిగిన వైనం చదివితే నా చిన్నప్పటి సంగతులు కొన్ని గుర్తొచ్చాయ్. ధన పరంగా విలువలేని వాటిని, ఎద పరంగా ఎంత అపురూపంగా దాచుకున్నామో కదా చిన్ననాడు!
"పెళ్ళి" కథలో రాజకీయ, ప్రభుత్వోద్యోగ రంగాల్లో పేరుకుపోయిన soft corruption పైన ఒక వ్యంగ్యం కనిపిస్తుంది. కథ అంతా సంభాషణగానే సాగడం ఇందులో ప్రత్యేకత.
మొత్తానికి "మిథునం" చాలా మంచి కథల పుస్తకం. చదవడం గొప్ప అనుభూతి మిగిల్చింది.
nacchutundani telusu… paniki vastundanii telusu!
I am glad to see a review on the whole book. I liked “peLLi” a lot too, for its conversational style from start to end. adbhutamaina “screenplay” adi!
I’ll wait for your review on “Sweet Home” also. (BTW, if I didn’t tell you already about it… The third part – written after a 20-30 year hiatus – is not anywhere near the first two, IMHO.)