చిల్లర

Note:కథలు రాయాలనే ప్రయత్నం చేసి చాలా కాలం క్రితం రాసుకున్న సరదా కథ ఇది.

చెన్నై తిరువాన్మయూర్ జంక్షనులో సిటీ బస్ కోసం వైట్ చేస్తున్నాను. “అబ్బా! ఉక్కపోత”. మధ్యాహ్నం సూర్యుడు ధారాళంగా ఎండ కురిపించి వెళ్ళాడేమో, ఇంకా వేడి తగ్గలేదు. చుట్టూ జనం జనం. చెన్నైలో రెండు సముద్రాలు ఉన్నాయి – ఒకటి జల సముద్రం, రెండోది “జన” సముద్రం. ఇదిగో ఆ జన సముద్రంలో ఈదుతూ, ఆఫీస్ నుండీ తిరిగొస్తున్న నన్ను ఇంటి ఒడ్డుకి చేర్చే బస్సు పడవ కోసం ఎదురు చూస్తున్నాను.

బస్టాప్ లో కనిపిస్తున్న జనం అంతా కొంపదీసి నా బస్ కే వస్తారో ఏమో! అప్పుడు మళ్ళీ స్టాండింగ్ తప్పదు. మన ఆంధ్ర ప్రదేశ్ లో అయితే లేడీస్ సీట్లు కొన్నే ఉంటాయి. తమిళనాడు వాళ్ళు బస్ లో ఎడంపక్క రో అంతా ఆడవాళ్ళకే కేటాయించేశారు. భార్యని అర్థాంగి అన్నారు కాబట్టి ఇలా తనువులోనూ, జీవితంలోనూ, ఆఖరికి బస్సులో కూడా సగం భాగం ఇచ్చెయ్యడం అన్యాయం! ముఖ్యంగా నా లాంటి బ్రహ్మచారులని ఇది ఘోరంగా చిన్న చూపు చూడటమే! అయినా సమానత్వం, సమానత్వం అంటూ గోలపెట్టే ఆడవాళ్ళు ఇలా బస్సులలోనూ, లోక్ సభల్లోనూ ప్రత్యేక కోటా కోరుకోవడం నాకు అర్థమయ్యి చావదు. ఇలా అయితే మరి వాళ్ళు మగ వాళ్ళ కంటే తక్కువేనని ఒప్పుకున్నట్టే కదా! ఏమో బాబూ! ఇలా అంటే నన్ను తరతరాల పురుషాహంకారానికీ, ఆధిపత్యానికీ, ప్రతినిధిననీ, స్త్రీలకు అవకాశాలిస్తే చూడలేకపోతున్నాననీ కడిగి పారేస్తారు! ఎందుకొచ్చిన గొడవ? నోరు మూసుకుంటే సరి. అయినా ఇంతా చేసి నేను దిగాల్సిన స్టాపుకి పావుగంట కూడా పట్టదు… ఆ కొద్ది సేపూ నిలబడలేనూ?

హమ్మయ్యా! బస్సు వస్తోంది, జనాలతో కళకళలాడుతూ! మన బస్సులు కూడా పుష్పక విమానాల్లాటివే! ఎంత మంది ఎక్కినా ఇంకా చోటు ఉంటుంది. భారతీయులలో కనిపించే సర్దుకుపోయే తత్త్వానికి, ఇలాటి క్రిక్కిరిసిన బస్సులు ఇతోధికంగా సాయపడుతున్నాయని నా సవినయ భావన. మొత్తానికి బస్సులోకి చేరాను. “యమ ఇరుకుల్లో పడి నలిగే కుస్తీ” అనే సినిమా పాట హం చేసుకుంటూ, నా ఫ్యాంట్ బ్యాక్ పాకెట్ తడిమి చూసుకున్న నేను అదిరి పడ్డాను…చేతికి చిల్లర తగలలేదు! చిన్నప్పుడు డిబ్బీలో దాచుకున్న చిల్లర డబ్బులు అమ్మ వాడేస్తే, ఖాళీ డిబ్బీ చూసి నేను డీలా పడ్డ సంగతి గుర్తొచ్చింది, ఇప్పుడు నా పరిస్థితి చూస్తే. హడావిడిగా వాలెట్ తీసి చూశాను, వంద కాగితాలు తప్ప చిల్లర లేదు. వంద కాగితంపై గాంధీ తాత జాలినవ్వొకటి నాపై ప్రసరించాడు.

చచ్చాం! ఇప్పుడేం చెయ్యాలి? నేను దిగాల్సిన అడయార్ జంక్షనుకి టికెట్ 3 రూపాయిలు. వంద ఇస్తే కండక్టర్ టికెట్ ఇస్తాడో లేదో? అదిగో కండక్టర్ వస్తున్నాడు…వస్తున్నాడు..వచ్చేస్తున్నాడు! కండక్టర్ దగ్గరౌతున్నకొద్దీ నా గుండె లబ్ డబ్ అని వేగంగా కొట్టుకుంటోంది, పరీక్షలు దగ్గరపడుతున్న స్టూడెంట్ లా! “టికెట్ ” అన్నాడు. నేను వందిచ్చి “అడయార్ జంక్షన్ ” అన్నా. “చిల్లర లేదా?” అని తమిళంలో అడిగాడు. నేను నాకేదో తెలియనట్టు, బ్యాక్ పాకెట్ ఒకసారి తడుముకున్నా, వాడికి కనబడేటట్టు! అక్కడ చిల్లర లేదన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి, వాలెట్ తీసి వాడికి కనిపించేటట్టే వెతికి చూసి, “అరే! చిల్లర లేదే” అని పైకి వినబడేటట్టే అని వాడికేసి చూశా, ఏమంటాడో అని! అమ్మాయికి ప్రపోజ్ చేసి ఎదురు చూస్తున్న అబ్బాయిలా ఉంది నా పరిస్థితి! కండక్టర్ ఇంతలో మెడకి వేలాడుతున్న విజిల్ తీసి ఊదాడు. బస్ ఆగింది. ఎందుకు బస్ ఆపాడా అని అనుకుంటున్న నాకేసి చిరాకుగా చూసి, చెయ్యి చూపించి బస్ దిగమన్నాడు, అదేదో సినిమాలో హీరోయిన్ “వెళ్ళూ, వెళ్ళూ, వెళ్ళవయ్యా!” అన్నట్టు! చెన్నైలో రెండేళ్ళుగా ఉంటున్నా ఒక్క ముక్క తమిళం రాదే అని ఇన్నాళ్ళూ బాధ పడేవాణ్ణి. ఈ రోజు భాష రాకపోవడంలో ఎంత ఆనందం ఉందో తెలిసివచ్చింది, వాడు తిట్టిన తిట్లకి! ఏమన్నాడో ఏమో. ఆ…ఏమని ఉంటాడు, “దిగు దిగవయ్యా! టిప్ టాప్ గా డ్రస్ వేసుకుని వచ్చేసి, అందమైన అమ్మాయిలు ఏ బస్ ఎక్కితే ఆ బస్ ఎక్కయ్యడం తప్ప, కొంచెం చిల్లర దగ్గర పెట్టుకోవాలన్న కామన్ సెన్స్ కూడా లేదు” అన్నాడేమో. అయినా విషయాన్ని పొలైటుగా చెప్పకుండా, దురుసుగా ప్రవర్తించడం, నా లాంటి “జంటిల్ మేన్ ” ని అవమానించడమే!

ఇలా అర్థాంతరంగా నేను బస్ నుంచీ నిష్క్రమించాల్సి వచ్చింది. దిగిన వెంటనే రాంగ్ నంబర్ బస్ ఎక్కాను అన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాను, చిల్లర లేదని దింపేశారని చుట్టూ వాళ్ళకి అనిపించకూడదని. చూస్తే నేను ఎక్కిన బస్ స్టాపుకి కొంచెం దూరంలోనే దిగాను. మళ్ళీ ఉసూరుమంటూ బస్ స్టాపు వైపు నడక సాగించాను. భంగపడ్డ మనసుకి ఓదార్పుగా – “ఇదీ నీ మంచికే. ఆ డొక్కు రష్ బస్ లో వెళ్ళే బదులు కాస్త ఖాళీగా ఉండే నెక్స్ట్ బస్ లో హాయిగా వెళ్ళొచ్చుగా” అని సర్దిచెప్పాను.

“చిల్లర సంపాయించాలి. ఎలాగ?” బస్ స్టాపు దగ్గరే ఓ ఫ్రూట్ జ్యూస్ స్టాల్ కనిపించింది. వెళ్ళి బత్తాయి జ్యూస్ ఆర్డరిచ్చా. ఈసారి ముందుచుపుగా ఆర్డర్ ఇచ్చేముందే అడిగా వాణ్ణి “వంద చిల్లర ఉందా?” అని, వచ్చీ రాని తమిళంలో. వాడు తలూపాడు. జ్యూస్ తాగుతుంటే ఒక గొప్ప ఆత్మ సాక్షాత్కారం కలిగింది – “జ్యూస్ తాగడం ఆరోగ్యకరం! రోజూ తినే తిండిలో పళ్ళు ఉండడం చాలా అవసరం. ఇన్నాళ్ళూ ఈ విషయాన్ని నేను నెగ్లెక్ట్ చేస్తున్నానని నాకు తెలియచెప్పడానికే దేవుడిలా చిన్న గుణపాఠం నేర్పాడని!!”. ఇలా అనుకోగానే కొంచెం ఉత్సాహం వచ్చింది. షాప్ వాడిచ్చిన పది కాగితాలు చూస్తే ఆ ఉత్సాహం మరింత పెరిగింది. ఆ క్షణంలో వంద కంటే పదికే విలువెక్కువ అనిపించింది!

ఈసారి ఇంకో బస్ వచ్చింది, అనుకున్నట్టే ఖాళీగా. నేను ఈల వేసుకుంటూ బస్ ఎక్కి, నా అంతట నేనే కండక్టర్ దగ్గరకి వెళ్ళి, స్టైలుగా పది కాగితం తీసి, టికెట్ అడిగా. వాడికి నా వాలకం, ఉత్సాహం అర్థం కాలేదు. టిక్కెట్టూ, చిల్లరా ఇచ్చాడు. ఫ్యాంట్ బ్యాక్ పాకెట్ అచ్చి రాలేదని, షర్ట్ పాకెట్లో ఆ చిల్లర జారవిడుస్తున్నప్పుడు చూశాను…ఇంత వరకూ గమనించని ఐదు రూపాయల కాయిన్ ఉందక్కడ, కొమ్మల చాటున మోము దాచుకున్న మందార మొగ్గలా నవ్వు చిందిస్తూ!

- 23rd Sept 2006

బారిష్టర్ పార్వతీశం

“బారిష్టర్ పార్వతీశం” అంటే ఒక హాస్య పాత్రనీ, అతను అమాయకుడు, వెర్రివాడూ అనీ ఇప్పటి వరకూ నా భావన. మరి స్కూల్లో చదువుకున్న తెలుగు non-detailed పుస్తకంలో ఇలాగే ఉంది. అయితే నా భావన తప్పని ఈ మధ్యే చదివిన detailed నవల చెప్పింది. 550 పేజీల ఈ పుస్తకంలో నేను ఎరిగిన పార్వతీశం కన్నా విభిన్నమైన ఒక సంపూర్ణ వ్యక్తిత్వం దర్శనమిస్తుంది.

“బారిష్టర్ పార్వతీశం” మూడు భాగాల నవల. మొక్కపాటి నరసింహశాస్త్రి గారికి కీర్తి ప్రతిష్టలు కట్టబెట్టిన ఈ రచన మొదటి భాగం అత్యంత జనాదరణ పొందింది. ఈ భాగంలో పార్వతీశం పుట్టుపూర్వోత్తరాలూ, అతని అటకెక్కిన చదువూ, రాజకీయ భావాలూ, ఇంగ్లాండు వెళ్ళాలన్న నిర్ణయం, ఇంట్లో చెప్పాపెట్టకుండా ప్రయాణం కట్టడం, దారీ పొడుగునా అజ్ఞానం వల్ల నవ్వులపాలు కావడం, ఎలాగో చెన్నై చేరి అక్కడి నుండి కొలొంబో చేరి చివరికి నౌక ద్వారా ఇంగ్లాండులో కాలుమోపడం కనిపిస్తాయ్. ఈ భాగం లో హాస్యం పాలు ఎక్కువ ఉండడం వల్ల జనాలకి బాగ గుర్తుండిపోయింది. అలాగే ఈ భాగంలో విషయం వల్ల పార్వతీశం ఒక విదూషకుడిలా చాలా మందికి గుర్తుండిపోయాడు.

 అయితే నిజానికి పార్వతీశం అమాయకుడు కాడనీ, తెలియనితనం వల్ల నవ్వులపాలు అయ్యాడు కానీ తెలివైన వాడు అనీ మనకి రెండో భాగంలో తెలుస్తుంది. రెండో భాగంలో ఆనాటి ఇంగ్లాండు జీవనం, పార్వతీశం అక్కడ మొదటి రోజుల్లో పడిన అవస్థలూ, బారిస్టర్ కోర్సుకి కట్టడం, ఇంగ్లాండు తెలుగు సమాఖ్య మిత్రులతో చేసిన అల్లల్రులు, paying guest గా ఉంటున్న ఇంటి యజమానురాలి కూతుర్లతో ఆడిన సరసాలూ, ఇంకా గోల్ఫ్ ఆటలో అత్యంత ప్రావీణ్యం సంపాదించి ఎన్నో బహుమతులు పొందడం, ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులూ, ఒక దొరసానితో సఖ్యతా, అనుబంధం, దాదాపు ప్రేమించడం, బారిష్టర్ పరీక్ష ప్రథమ శ్రేణిలో జయప్రదంగా ఉత్తిర్ణుడయ్యి తన ప్రియురాలికి కన్నీటితో వీడ్కోలు పలికి తిరిగి భారతదేశం చేరడం కనిపిస్తాయ్. నిజానికి ఈ నవల రచయిత స్వానుభవం నుండీ వచ్చినది – ఆయనా బారిస్టర్ చదువుకై ఇంగ్లాండ్ వెళ్ళారు. కాబట్టి ఇంగ్లాండ్ వర్ణన సహజంగా, ఎన్నో చమత్కార సంఘటనలతో కూడి రసవత్తరంగా సాగుతుంది. ఆనాటి సాంఘిక పరిస్థితులని మనకి చూపెడుతుంది. ఈ భాగంలో కొంత ప్రణయాలూ, పడుచు అల్లరులూ ఎక్కువ కనిపించి రసస్ఫూర్తికి ఇతోధికంగా దోహదం చేస్తాయ్!

ఇక ఆఖరిదైన మూడవ భాగంలో ఇంటికి చేరడం, తన ఊరి వారికి ఇంగ్లాండ్ విశేషాలు చెప్పడం, ఒక చక్కని చుక్కని చూసి మనసు పారేసుకుని పెళ్ళి చేసేసుకోవడం, లాయరుగా ప్రాక్టీసు పెట్టడం, చక్కని పేరు సంపాయించడం, ఇంతలోనే భారత స్వాతంత్ర ఉద్యమంలో ఆకర్షించబడడం, పాల్గొనడం, స్వాతంత్రం వచ్చాక తిరిగి కొంత కాలం లాయరు వృత్తిలో ఉండి, ఆ వృత్తిలో ఉండే అన్యాయాలూ, మనస్తత్త్వాలూ పడక హాయిగా సొంత ఊరుకి చేరుకుని వ్యవసాయం చేసుకోడం కనిపిస్తాయ్. ఈ భాగంలో ముఖ్యంగా ఐదు రోజుల పెళ్ళి వర్ణన, భారత స్వాతంత్ర ఉద్యమ పరిస్థితులూ ఆసక్తి కలిగిస్తాయ్. ఐతే కథ చివరలో కొంత abrupt గా ముగించినట్టు అనిపిస్తుంది.

ఈ పుస్తకంలో కథతో పాటూ రచయిత ప్రతి భాగానికి రాసిన “తుది పలుకులు” ఎంతో ఆసక్తి కలిగించేలా ఉన్నాయ్. ఈ నవలకి ఆ రోజుల్లో వచ్చిన విమర్శలని కొంత ప్రస్తావించారు రచయిత. నవ్వు మనలో “అహంకార భావం” (ego) వల్ల వస్తుంది వంటి philosophical విషయాల గురించి చర్చ కూడా చదవొచ్చు. అలాగే పార్వతీశానికీ, గురజాడ గారి గిరీశానికీ, పానుగంటి వారి గణపతికీ మధ్య పోలికలూ, తేడాల గురించీ రచయిత వివరిస్తారు. తిట్ట్లు హాస్యం అనిపించుకోవని వీరేశలింగం గారినీ, పానుగంటి వారినీ సున్నితంగా రచయిత విమర్శిస్తారు. అలాగే అల్ప విషయాల నుండీ హాస్యం పుట్టించిన ఘనత చింతా దీక్షితుల వారిది మాత్రమే అని పేర్కొంటారు.

 మొత్తానికి చాలా కాలం తర్వాత ఒక చక్కని తెలుగు నవల చదవడం సంతృప్తి కలిగించింది. english నవలల్లో ఉండే అందాలూ విషయాలూ ఒకటైతే మనదైన నవలల్లో మనదైన అందం, విజ్ఞానం, సాహిత్యం కనిపించి మురిపింపజేస్తాయ్. ఈ విషయం గ్రహించక మన తెలుగు నవలల్లో పెద్ద విషయం ఏమీ ఉండదు, ఆ ఇంగ్లీష్ వాళ్ళ creativity చూడండి, మనవన్నీ కాపీ మాత్రమే అనే వాళ్ళని చూస్తే నవ్వు వస్తుంది. పార్వతీశం అమాయకుడూ, వెర్రివాడూ అనుకోవడం ఎంత తప్పో ఇదీ అంతే తప్పు!

స్లం డాగ్ మిలియనీర్

స్వాతి మాసపత్రికలో  మాలతీ చందూర్ గారు Q and A అన్న నవల గురించి రాశారు. నాకు నవలలోని విషయం కన్నా నవల కథనం బాగా నచ్చింది. “సినిమా తియ్యొచ్చు” అనుకున్నా వెంటనే, ఈ లోపు వ్యాసం చివరలో చందూర్ గారు రాశారు “ఈ నవల ఆధారంగా Slumdog Millionaire అనే సినిమా తీశారు అని. ఇలా మొదటిసారిగా ఈ సినిమా గురించి వినడం జరిగింది. అప్పటికి ఈ సినిమా అంత popular కాలేదు (release కూడా కాలేదేమో బహుశా). తర్వాత చూస్తే ఏముంది, ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే – రెహ్మాన్ కి Golden globe, అంతర్జాతీయ ప్రశంసలు, కలక్షన్ల రికార్డులు, ఆస్కార్ నామినేషన్….అబ్బో! పెద్ద సంచలనమే సృష్టించింది ఈ సినిమా. అయితే ఈ సినిమాకి కొన్ని విమర్శలు కూడా వచ్చాయి – ముఖ్యంగా మన దేశం నుంచి. ఈ విమర్శల గురించీ, ఈ సినిమా పై నా అభిప్రాయం గురించీ చెప్పడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.

“ఈ మధ్య నేను చదివిన నవలల్లో నన్ను బాగా కదిలించి, నిద్రపట్టకుండా చేసిన నవల” ఇది అని రాశారు మాలతీ చందూర్ గారు. ఈ సినిమా గురించి నేను చదివిన reviews లో కూడా ఇదే ఉంది. ఇవి చదివి ఒకింత ఉత్సాహంతో DVD లో ఈ సినిమా చూశాను. చక్కటి సినిమానే అనిపించింది. కథా, కథనం, నటనా, సంగీతం బాగా కుదిరాయ్. అయితే నాలో గొప్ప అనుభూతి గానీ, ఇది అద్భుతమైన చిత్రం అనే భావన గానీ ఏమీ కలగలేదు. ఇందులో Real India అని చూపించిన India, real అని ఒప్పుకోక తప్పదు. మన దేశంలోని slums లో జీవనాన్ని, మత కల్లోలాలనీ, పేదరికాన్ని, అన్యాయాన్ని చూపించారు. అయితే సినిమా కథనం వేగంగా ఉండడం వల్ల ఇవన్నీ అలా కనిపించి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది, మనలో పెద్ద స్పందన ఏమీ కలగజేయకుండానే. మిగతా దేశాల వాళ్ళ మాటేమో గానీ, మనకి మాత్రం ఈ reality అంతా తెలిసినదే. అయితే మొత్తం reality ఇదే కాదనీ, ఈ సినిమాలో చూపించని India కూడా ఉందనీ సగటు భారతీయుడికి ఎవరికైనా తెలుస్తూనే ఉంటుంది, సినిమాలో ఈ other reality గురించి ఊసైనా ఎత్తకపోయినా. ఇందుకేనేమో కొందరు ఈ సినిమా భారత దేశాన్ని కొంత హీనంగా చూపించిందని అభిప్రాయపడ్డారు. ఈ సినిమా “సంపూర్ణ భారతదేశ దర్శనం” చేయించేది ఏమీ కాదనీ, కథకు తగ్గ సంఘటనలే చూపారనీ, సినిమాని ఒక సినిమాగానే కళగానే చూడాలి తప్ప దానిని వాస్తవంతో confuse కాకూడదనీ అనుకుంటే ఈ realities గోల లేకుండా మీరు సినిమా చూడగలుగుతారు.

సరే! ఈ reality గొడవ వదిలేసి సినిమాలో కళనీ, కథనీ చూద్దాం. కథ చిన్నదే: slums లో పెరిగిన ఓ కుర్రాడి జీవితంలోని కొన్ని హృదయవిదారకమైన సంఘటనలూ, అతని ప్రేమ కథా, ప్రియురాలి కోసం, who wants to be millionarie లో పాల్గొనడం, గెలవడం, ఇదీ కథ, కథని కళాత్మకంగా చూపించడానికి దర్శకుడు కచ్చితంగా ప్రయత్నించాడు. అయితే వాస్తవాన్ని మరీ సూటిగా, కొన్ని సార్లూ కావాలని హేయంగా చూపించినట్టు నాకు అనిపించింది – అమితాబచ్చన్ ని చూడ్డం కోసం చిన్న పిల్లవాడు మల కూపంలోకి దూకడం, tourists కారు పార్క్ చేసిన వెంటనే కారు టైర్లు దొంగలించబడడం, పోలిసు guide ఏ దొంగ వెధవని కొడుతుంటే వాడు foreign tourist తో You wanted to see India right? This is real India అనడం, ఆ tourist,  I will show you real America”  అని జాలితో డాలర్ల నోట్లు తీసి ఇవ్వడం మొదలైనవి. అయితే మీ అభిరుచిని బట్టి ఈ scenes మీకు కళగానూ అనిపించవచ్చు, నచ్చనూ వచ్చు, కదిలించనూ వచ్చు. అందరి స్పందనలూ ఒకేలా ఉండాలని లేదు కదా! ఈ విషయం గురించి కూడా తర్జన భర్జనలూ, విమర్శలూ, ప్రతి-విమర్శలూ అవీ అనవసరం అని నా అభిప్రాయం.

సినిమాలోని ప్రేమ కథ నాయికా-నాయకుల చిన్నప్పటి  నుండీ మొదలవుతుంది. నిజాయితీగా, సహజంగా అనిపిస్తుంది. వాళ్ళు కొంత పెద్దైన తరువాత జరిగే ప్రేమ కథ (సినిమా last 45 min ఇదే ఉంటుంది) చూస్తే bollywood masala కథలా అనిపించింది నాకు. అప్పటి దాకా ఉన్న feel పోయిందనిపించింది. పైగా సినిమా రివ్యూలు కొన్నింటిలో రాసినట్టు “కష్టాల నుంచి కోటీశ్వరుడిగా” మారిన inspirational and positive attitude story అని కూడా ఏమీ అనిపించలేదు నాకు. మీకు వేరేలా అనిపించొచ్చు గాక.

ఇక చివరిగా music గురించి. రెహ్మాన్ కి గొప్ప అభిమానిని అయిన నాకు ఈ సినిమా సంగీతం బాగుందనే అనిపించింది. అయితే definitely not the best of Rahman so far అని విమర్శకులూ ఒప్పుకుంటారు అనుకుంటాను. ఆస్కార్ కి నామినేట్ అయిన “జై హో” పాట అతి చక్కటి పాటే అయినా, గొప్ప పాట కాదని నా అభిప్రాయం, అయినా ఇన్నాళ్ళకు రెహ్మాన్ కి గొప్ప గుర్తింపు ఈ సినిమా వల్ల రావడం అందరికీ ఆనందమే కదా. నిన్న రెహ్మాన్ అన్నారుట – ” ఈ సినిమాని విమర్శించకండి. నచ్చకపోతే మీకు నచ్చినట్టు సినిమా తీసి చూపించండి” అని. ఆయన చెప్పినదాంట్లోని విషయాన్ని అభినందిస్తూనే, ఆయనకి ఇలా చెప్పాలనుంది – “రెహ్మాన్ జీ! మరి సినిమా తియ్యలేని సామాన్య ప్రేక్షకులకి అభిప్రాయాలూ ఉండకూడదా? ఉంటే మరి బయటకి చెప్పకూడదా? ఆ చెప్పినదే విమర్శ అనుకుంటే ఎలా? వాడి అభిప్రాయం అది అనుకుని వదిలెయ్యొచ్చు కదా! ఎందుకంటే నిజమైన విమర్శ చెయ్యగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నాబోటి మిగాతావాళ్ళంతా ఇలా బ్లాగుల్లోనో వాగుడ్లోనో తోచినవి పంచుకుంటారు!”